అమరావతి: గతంలో అప్రజాస్వామికంగా, అనైతికంగా శాసనసభను నిర్వహించారని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆరోపించారు. ఇప్పటికైనా ప్రతిపక్ష నేత చంద్రబాబు హుందాగా వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

కులమతాలు, పార్టీలకు అతీతంగా అర్హులకు సంక్షేమ పథకాలు అందిస్తామని చెవిరెడ్డి బుధవారం మీడియాతో చెప్పారు. దేశానికే ఆదర్శప్రాయంగా సీఎం జగన్‌ పరిపాలన ఉంటుందని అభిప్రాయపడ్డారు. సగం మంది అసెంబ్లీకి కొత్తగా వచ్చారని, అందరినీ కలుపుకుని వెళ్తామని చెవిరెడ్డి చెప్పారు.

ప్రజలకు ఉపయోగపడే విధంగానే నిర్ణయాలు తీసుకుంటామని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ప్రతిపక్షాన్ని అంతం చేయాలనే ఉద్దేశం తమకు లేదని ఆయన అన్నారు. చర్చలు పారదర్శకంగా జరగాలని కోరుతున్నామని అన్నారు. ముఖ్యమంత్రి.వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన తీరు ఏవిధంగా ఉందో.. అసెంబ్లీ కూడా అదే స్ఫూర్తితో కొనసాగుతుందని ఆయన అన్నారు. 

గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రతిపక్షం గొంతు నొక్కిందని, అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి అడ్డగోలుగా కొనుగోలు చేశారని ఆయన గుర్తు చేశారు. అధికార పక్షం చెప్పినట్లు ఆడుతూ స్పీకర్ పదవికే కోడెల మచ్చ తెచ్చారని విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభను హుందాగా నడిపిస్తామని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తెలిపారు. సభలో ప్రతిపక్షాన్ని కూడా గౌరవిస్తామని, సమావేశాలను హుందాగా నిర్వహిస్తామని ఆయన బుధవారం శాసనసభ సమావేశాల సందర్భంగా మీడియాతో అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు వెళతామని మంత్రి అనిల్‌ కుమార్‌ చెప్పారు. 

వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన వెంటనే రాష్ట్రానికి మంచి నాయకుడు వచ్చాడని ప్రజలకు సంకేతాలు ఇచ్చారని, ఏది చెబుతామో అది చేసి తీరాలనే విధంగా వైఎస్‌ జగన్‌ ముందుకు వెళుతున్నారన్నారు.