చెస్ లో ఉమెన్ గ్రాండ్ మాస్టర్, తెలుగు తేజం బొడ్డా ప్రత్యూష పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఈ రోజు గుడివాడకు చెందిన ఛార్టర్డ్ అకౌంటెంట్ వంగలపూడి రవితేజను వివాహం ఆడబోతోంది.
అనకాపల్లి : చెస్ ఉమెన్ గ్రాండ్ మాస్టర్ Bodda Pratyusha, కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన ఛార్టర్డ్ అకౌంటెంట్ వంగలపూడి రవితేజ మూడుముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పట్టణంలోని జగతా అప్పారావు కల్యాణ మండపం వేదికగా గురువారం వీరి వివాహం జరగనుంది. ప్రత్యూష స్వస్థలం పాయకరావుపేట మండలం మంగవరం. తండ్రి ప్రసాద్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తల్లి సత్యాదేవి గృహిణి. నాలుగేళ్ల వయసు నుంచే చెస్ ఆడుతున్న ప్రత్యూష ఎన్నో విజయాలను సొంతం చేసుకుని ఉమెన్ గ్రాండ్ మాస్టర్ గా ఎదిగారు. అండర్ 9 విభాగంలో ప్రపంచ ఛాంపియన్, అండర్-12,14,16,18 విభాగాల్లో కామన్ వెల్త్ ఛాంపియన్ గా నిలిచింది. అండర్-16 ఏషియన్ ఛాంపియన్, 2016లో ఒంలింపియాడ్ టీం మెంబర్ గా ఎంపికయ్యింది. ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రత్యూష ఇంటర్నేషనల్ చెస్ అకాడమీ ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తోంది.
