నెల్లూరు జిల్లాలో టిడిపి నేతలవై వరుసగా పోలీసు కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన ఎంఎల్సీ వాకాటి నారాయణరెడ్డి, ఎంఎల్ఏ బొల్లినేని రామారావుపై ఇప్పటికే బ్యాంకులను మోసం చేసారన్న కేసులున్న విషయం అందరకీ తెలిసిందే. అదే కోవలోకి నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్ కూడా చేరారు. వైసిపి తరపున మేయర్ గా గెలిచిన అబ్దుల్ నెలన్నరకే టిడిపిలో ఫిరాయించారు.

ఇంతకీ విషయం ఏమిటంటే, స్టార్ ఆగ్రో పేరుతో మోసాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో మేయర్‌ పై పోలీసు కేసు నమోదైంది. అబ్దుల్ తో పాటు అత‌ని సోద‌రుడు జ‌లీల్, డైరెక్ట‌ర్ అనిల్ పై మద్రాస్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో చీటింగ్ కేసు న‌మోదు అయింది. ప్రసాద్ జెంపెక్స్ అనే కంపెనీ  స్టార్ ఆగ్రోలో వాటా కోసం ఇచ్చిన రూ.42కోట్లు ఇచ్చింది. అయితే, ఆ మొత్తాన్ని మేయర్ ఆగ్రో ఖాతాలో కాకుండా తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారంటూ మేయర్ పై గతేడాది డిసెంబర్‌లో ఫిర్యాదు వచ్చింది.

ఈ ఫిర్యాదును పరిశీలించిన మద్రాస్ సీసీబీ (సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ) 406,420, 506, రెడ్ విత్ 120-బి సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసింది.  మరోవైపు మేయర్‌ అజీజ్‌ సోదరులు ముందస్తు బెయిల్‌ కోసం కోర్టును ఆశ్రయించారు. కాగా అబ్దుల్‌ అజీజ్‌పై చీటింగ్‌ కేసు వ్యవహారంలో అధికార టీడీపీలో కలకలం రేపుతోంది.