ఆనందయ్య మందు హడావిడి ఏపీలో ఇంకా కొనసాగుతోంది. అటు రేపటి నుంచి మందు పంపిణీ ఆనందయ్య సిద్ధమవుతున్నారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలో మందు తయారీ కొనసాగుతోంది. ఆనందయ్య కుటుంబసభ్యుల్ని తిరుపతి తీసుకెళ్లిన ఆయన.. అక్కడ చంద్రగిరి సమీపంలోని ప్రైవేట్ గార్డెన్స్‌లో మందు తయారు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇందుకు సంబంధించి ముందుగానే ఆకులు, వనమూలికలు సిద్ధం చేశారు ఎమ్మెల్యే చెవిరెడ్డి. ఆయన తన నియోజకవర్గం మొత్తం ఇంటింటికి మందును సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఎవరూ కూడా ఈ మందు తయారు చేసే చోటికి రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం ఎంతో శ్రమకోర్చి.. మందుకు కావాల్సిన వనమూలికలను ఆయన సేకరించారు. ఈ రోజు రాత్రికి ఎంత మందు తయారైతే అంత మొత్తాన్ని ప్యాకెట్లలో నింపి రేపు ప్రజలకు అందిస్తారని తెలుస్తోంది. అటు ఆదివారం ఉదయం నుంచి కృష్ణపట్నంలో కూడా మందు తయారీ జరుగుతోంది. 

Also Read:ఆనందయ్య మందు పంపిణీ ప్రారంభం: సర్వేపల్లి ప్రజలకు మెడిసిన్

మరోవైపు ప్రభుత్వం నుండి అనుమతి రావడంతో సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు మందు పంపిణీకి ఆనందయ్య ఆదివారం నాడు శ్రీకారం చుట్టారు. సోమవారం నుండి ఇతర ప్రాంతాలకు చెందిన వారికి మందు పంపిణీ ప్రారంభించే అవకాశం ఉంది.రెండు వారాల తర్వాత మందు పంపిణీని ఆదివారం నాడు ఆయన చేపట్టారు. మూడు రోజుల క్రితమే ఆయన మందు తయారీని ప్రారంభించాడు. ఆన్‌లైన్ లోనే మందు పంపిణీ చేపడుతామని రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. 

సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు ముందుగా మందును పంపిణీ చేయాలని ఆయన భావించారు. ఈ మేరకు ఇవాళ స్థానికులకు  మందును అందిస్తున్నారు. మందు కోసం ఎవరూ కూడ కృష్ణపట్టణం రావొద్దని ఆయన మరోసారి ప్రజలను కోరారు. గత నెల 21న మందు పంపిణీని నిలిపివేశారు. ఆయుష్ నివేదిక ప్రకారంగా మందు పంపిణీకి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.