ఆంధ్రప్రదేశ్ లో కూడా జల్లికట్టు మొదలవ్వబోతోంది. ఇప్పటి వరకూ తమిళనాడుకు మాత్రమే పరిమితమైన ప్రమాదకర ఎద్దుల పోటీ మంగళవారం రాష్ట్రంలో జరుగుతోంది. అదికూడా అక్కడా ఇక్కడా కాదు సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పుట్టి పెరిగిన నియోజకవర్గంచంద్రగిరిలోనే. సిఎం చంద్రగిరిలో ఉండగానే అనుమతులు లేకుండానే జల్లికట్టు నిర్వహిస్తుండటం గమనార్హం.

చంద్రగిరి నియోజకవర్గంలోని రంగంపేటలో జల్లికట్టు నిర్వహణకు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే, జల్లికట్టు నిర్వహణకు పోలీసుల నుండి నిర్వాహకులు ఎటువంటి అనుమతులు తీసుకోలేదని సమాచారం. మండలంలోని అన్నీ పార్టీల నేతలూ జల్లికట్టు నిర్వహణకు సానుకూలంగా ఉండటంతో పోలీసులు ఏమి చేస్తాన్నదే ప్రశ్న.

తమిళనాడులో జల్లికట్టు క్రీడ ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. పరిగెడుతున్న ఎద్దులను పట్టుకునేందుకు ఉత్సావహంతులైన యువకులు ఎద్దులతో పోరాటాలు చేస్తారు. ఆ పోరాటంలో అప్పుడప్పుడు ఇటు ఎద్దులు అటు యువకులు కూడా ప్రాణాలు కోల్పోవటం అందరూ చూస్తున్నదే. అందుకనే జల్లికట్టు క్రీడ నిర్వహణకు వ్యతిరేకిస్తూ చెన్నైలో పలువురు  సామాజిక కార్యకర్తలు కోర్టుకు వెళ్ళారు.

కోర్టులు కూడా జల్లికట్టు నిషేధంపై మొగ్గు చూపినా ఉపయోగం కనబడలేదు. ఎందుకంటే కోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా జనాలందరూ పోయిన సంవత్సరం చెన్నైలోని మెరీనా బీచ్ లో ఏ స్ధాయిలో ఆందోళన చేశారో అందరికీ తెలిసిందే. దాంతో కేంద్రం జోక్యం చేసుకుని జల్లికట్టుకు అనుమతులు ఇప్పించాల్సి వచ్చింది. అదే స్పూర్తితో చంద్రగిరిలో కూడా ఈరోజు జల్లికట్టు నిర్వహణకు రంగం సిద్ధమైంది.