విశాఖపట్టణం: తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు తాను భయపడబోనని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు.ప్రత్యేక హోదాను వ్యతిరేకిస్తున్న కేసీఆర్‌ను జగన్, పవన్‌లు సమర్ధిస్తున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

విశాఖ జిల్లా తగరపువలసలో గురువారం నాడు జరిగిన ఆత్మీయ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పాల్గొన్నారు.తాను తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడలేదన్నారు. రెండు రాష్ట్రాలు కూడ ఆమోదయోగ్యంగా ముందుకు పోవాలనేదే తమ అభిమతమని చంద్రబాబు చెప్పారు.

రెండు రాష్ట్రాలు  విబేధాలు లేకుండా ముందుకు పోవాలని తాను కోరుకొంటే... కొందరు విబేధాలు ఉంటేనే  తమకు రాజకీయ ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారని పరోక్షంగా వైసీపీపై చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు.

కష్టాలు,ఇబ్బందులను అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నట్టు చంద్రబాబునాయుడు చెప్పారు.తెలంగాణకు ఇబ్బంది లేకుండా ఏపీకి హోదా ఇస్తామంటే జగన్‌, పవన్ ‌లకు ఇబ్బందేమిటని బాబు ప్రశ్నించారు. లాలూచీ రాజకీయాలు చేసేవారు చరిత్రహీనులుగా మిగిలిపోతారని విపక్షాలపై బాబు విరుచుకుపడ్డారు.

ఏపీ రాష్ట్రంలో ఉన్న విపక్షపార్టీలు పోలవరం, అమరావతి నిర్మాణం కోసం అడుగడుగునా కూడ అడ్డుపడ్డారని చంద్రబాబునాయుడు విమర్శించారు.రాష్ట్రానికి కేంద్రం అండగా ఉంటే  ఇంత కష్టపడాల్సి వచ్చేది కాదన్నారు. ఏపీలో వైసీపీ నేతలు  కేసీఆర్ ఫోటోలు పెట్టుకొని ఊరేగుతున్నారని చంద్రబాబునాయుడు విమర్శించారు. 

ఏపీకి ప్రత్యేక హోదా వద్దన్న కేసీఆర్‌ ఫోటోలను పెట్టుకొని  వైసీపీ నేతలు ఎలా తిరుగుతారో చెప్పాలని చంద్రబాబునాయుడు ప్రశ్నించారు.వైసీపీ నేతలది రాజకీయ అవకాశవాదమని  ఆయన విమర్శించారు.