అమరావతి:  వైఎస్ఆర్ నేను  బెస్ట్ ఫ్రెండ్స్ అని మాజీ  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఈ విషయం మీకు కూడ తెలుసునన్నారు.

గురువారం నాడు ఏపీ అసెంబ్లీలో అక్రమ కట్టడాలపై జరిగిన చర్చ సందర్భంగా వైసీపీ సభ్యుడు అంబటి రాంబాబు వైఎస్ఆర్ విగ్రహాలను చూసి చంద్రబాబుకు కడుపు మండుతోందని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలకు చంద్రబాబునాయుడు స్పందించారు.  తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంచి స్నేహితులమని  ఆయన గుర్తు చేశారు. తాము మంత్రులుగా ఉన్న సమయంలో ఇద్దరం ఒకే రూమ్‌లో పడుకొనే వాళ్లమని ఆయన ప్రస్తావించారు.

ఈ విషయం జగన్‌కు తెలుసో తెలియదన్నారు. వైఎస్ఆర్ విగ్రహాలు పెడితే తనకు ఎందుకు కడుపు మంట ఉంటుందని ఆయన ప్రశ్నించారు.  ఈ సమయంలో చంద్రబాబుకు ఎమ్మెల్యే టిక్కెట్టును వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇప్పించారని వైఎస్ఆర్‌సీపీ సభ్యులు వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై చంద్రబాబునాయుడు స్పందించారు.

ఎవరు ఎవరికీ టిక్కెట్లు ఇప్పించారో తెలుసుకోవాలన్నారు. అన్ని విషయాలు తెలిసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రస్తుతం లేడని చంద్రబాబునాయుడు చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో తనకు వ్యక్తిగత విరోధం లేదన్నారు. రాజకీయంగా పోరాటం చేశామని ఆయన చెప్పారు. తమ మధ్య రాజకీయపరమైన విభేదాలు మాత్రమే ఉన్నాయన్నారు. వ్యక్తిగతంగా తమ మధ్య ఎలాంటి శతృత్వం లేదన్నారు.