నా సభ వద్ద పోలీసులే కన్పించడం లేదు: బాబు వ్యాఖ్యలకు నవ్వులు
పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పోలీసులను కోరారు.
గుంటూరు: తన సభ వద్ద పోలీసులే కన్పించడం లేదని...పోలీసులు తన సభల వద్దకు రావడం లేదా అని తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. చంద్రబాబు వ్యాఖ్యలకు ఈ సభలో బందోబస్తు విధులు నిర్వహిస్తున్న పోలీసులు ముసిముసి నవ్వులు నవ్వారు.
సోమవారంనాడు గుంటూరు జిల్లా పొన్నూరులో జరిగిన రా కదలిరా సభలో చంద్రబాబునాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లి ఆర్డర్స్ శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చంద్రబాబు కోరారు. త్వరలోనే తెలుగు దేశం, జనసేన ప్రభుత్వం వస్తుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేయాలని ఆయన కోరారు.
నిష్పక్షపాతంగా పనిచేయకపోతే ప్రజాస్వామ్యానికే ఇబ్బంది కలుగుతుందన్నారు. తాను 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడ పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించేలా చూసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.పోలీసులు,ఉద్యోగులు, అంగన్ వాడీ టీచర్ల న్యాయ సమస్యలను పరిష్కరిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఇది 16వ మీటింగ్.... ఇంకా 10 రోజుల్లో జన ఉధృతిని చూస్తారని చంద్రబాబు చెప్పారు. వైఎస్ఆర్‌సీపీని జగన్ భూస్థాపితం చేయబోతున్నారన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా రా కదలిరా పేరుతో చంద్రబాబునాయుడు సభలు నిర్వహిస్తున్నారు. తెలుగు దేశం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడంతో పాటు వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై చంద్రబాబు విమర్శలు గుప్పిస్తున్నారు.
also read:ఆ రెండు ఘటనల్లో బాబును కాపాడిన సెక్యూరిటీ: నాడు గద్వాల, నేడు రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది దరిమిలా రాష్ట్రంలో తెలుగుదేశం, వైఎస్ఆర్‌సీపీలు ప్రచార కార్యక్రమాలను ప్రారంభించాయి. సిద్దం పేరుతో వై.ఎస్. జగన్ విశాఖపట్టణం భీమిలీలో సభ ద్వారా ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. రాష్ట్రంలోని ఐదు చోట్ల సిద్దం పేరుతో జగన్ సభలను నిర్వహించనున్నారు.