అనంతపురం:   అభివృద్ది చేయడమే తాను చేసిన తప్పా అని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. 

అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ని వీరాపురంలోజరిగిన  టీడీపీ కార్యకర్త భాస్కర్ రెడ్డి కుటుంబాన్ని చంద్రబాబునాయుడు మంగళవారం నాడు పరామర్శించారు. బాధిత కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సహాయం చేశారు.ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.రాత్రి, పగలు తేడా లేకుండా అభివృద్ది పనులు చేసినట్టుగా ఆయన గుర్తు చేశారు. నీతి , నిజాయితీగా తన పాలన కొనసాగించినట్టుగా ఆయన ప్రస్తావించారు.

వైసీపీ చేసే దాడులు, దౌర్జన్యాలను ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని  చంద్రబాబునాయుడు ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తన ప్రాణాలను ఫణంగా పెడతానని చంద్రబాబు చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తలు, నేతలు తమ గ్రామాల్లోకి వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆయన ఆరోపించారు. 

టీడీపీ నేత కేసరి రవిని పోలీసుస్టేషన్లో బట్టలు విప్పి నిర్భంధించారని చంద్రబాబునాయుడు ఆరోపించారు. అవసరమైతే ఇలాంటి ఘటనలపై ప్రైవేటు కేసులను పెడతామన్నారు.రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిస్థితులపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. 

శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్యేకే రక్షణ లేదన్నారు. ఎమ్మెల్యేలకే ఈ ప్రభుత్వ హాయంలో రక్షణ కల్పించలేకపోయారని  చెప్పారు. మంచి ముఖ్యమంత్రిగా అనిపించుకొంటానని జగన్ చెప్పారన్నారు. ఎమ్మెల్యేలపై దాడులకు పాల్పడడం, కార్యకర్తలను బెదిరించడమే మంచి పాలనా అని ఆయన ప్రశ్నించారు.

ఆరు మాసాల వరకు ప్రభుత్వానికి సమయం ఇవ్వాలనుకొన్నామన్నారు. కానీ, టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. టీడీపీ కార్యకర్తలపై దాడులను నిరసిస్తూ రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేయాల్సిన పరిస్థితులను ప్రభుత్వం కల్పించిందన్నారు.

తనకు నచ్చిన పార్టీలో చేరడమేనా భాస్కర్ రెడ్డి చేసిన తప్పు అని ఆయన  ప్రశ్నించారు. భాస్కర్ రెడ్డిని వైసీపీ కార్యకర్తలు కొట్టి చంపారన్నారు. భాస్కర్ రెడ్డిని చంపిన వారు ఆయన పిల్లలకు ఏం సమాధానం చెబుతారన్నారు.