పికె వ్యూహాలతో జగన్: గ్రూప్ ఎంపై చంద్రబాబు అసంతృప్తి?

పికె వ్యూహాలతో జగన్: గ్రూప్ ఎంపై చంద్రబాబు అసంతృప్తి?

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తొలిసారి రాజకీయ పార్టీలు వ్యూహకర్తలను నియమించుకున్నాయి. వచ్చే ఎన్నికలకు ఆ వ్యూహకర్తలు ఆయా పార్టీలు అనుసరించాల్సిన వ్యూహాలను ఖరారు చేసి అందిస్తారు. 

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు గ్రూప్ ఎంను నియమించుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు ప్రశాంత్ కిశోర్ వ్యూహాలను అందిస్తున్నారు. ప్రజాసంకల్ప యాత్రలో ప్రశాంత్ కిశోర్ అందించిన వ్యూహాల ప్రకారమే జగన్ వ్యవహరిస్తున్నట్లు, అందుకు తగినట్లుగా ప్రసంగాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తన ముఖ్య వ్యూహకర్తగా దేవ్ ను నియమించుకున్నారు. ఆయన 1,200 మంది సభ్యులతో కలిసి పనిచేస్తారు. రాజస్థాన్ కు చెందిన దేవ్ కు బిజెపి కూడా సత్సంబంధాలున్నట్లు చెబుతు్నారు. ముఖ్యమైన నియోజకవర్గాల్లో దేవ్ జట్టు సర్వే నిర్వహచించి పవన్ కల్యాణ్ కు నివేదిక సమర్పిస్తుంది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లి ప్రతిష్టను పెంచేందుకు అవసరమైన వ్యూహాలను చంద్రబాబు కోసం గ్రూప్ ఎం రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే, గ్రూప్ ఎం పట్ల చంద్రబాబు అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. సంక్షేమ పథకాలపై మీడియాలో పెద్దగా ప్రచారం లేకపోవడమే అందుకు కారణమని అంటున్నారు. 

ప్రభుత్వ పథకాలపై మంత్రులు మీడియా సమావేశాలు ఏర్పాటు చేయాలని, మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టి సమావేశాలు నిర్వహించాలని గ్రూప్ ఎం సూచించినట్లు సమాచారం. వివిధ శాఖలు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి ఆ విధంగా తీసుకుని వెళ్లాలని చెప్పినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఆ ప్రచారం సాగాలని సూచించినట్లు సమాచారం. 

పక్షం రోజుల క్రితం గ్రూప్ ఎం అందించిన నివేదికను వివిధ ప్రభుత్వ శాఖలు అంతగా పట్టించుకోవడం లేదనే మాట వినిపిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు చంద్రబాబు నాయుడే బ్రాండ్ ఇమేజ్ అని, అంతకన్నా ఏమీ అవసరం లేదని మంత్రులు, టీడీపి నాయకులు భావిస్తున్నట్లు చెబుతున్నారు.  

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos