చంద్రబాబునాయుడు తాజా రాజకీయంతో తమ్ముళ్ళల్లో ఆందోళన మొదలైంది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు సరికొత్త రాజకీయానికి తెరలేపుతున్నారు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం వచ్చే ఎన్నికల్లో ఎవరికి టిక్కెట్లు ఇవ్వాలి? ఎవరికి కోత కోయాలనే విషయంలో చంద్రబాబులో ఇప్పటికే స్పష్టత వచ్చేసింది. నియోజకవర్గాల వారీగా చంద్రబాబు నెలకోసారి సర్వేలు చేయించుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే.

చంద్రబాబు చేయించుకుంటున్న సర్వేలే తమ్ముళ్ళ కొంప ముంచబోతున్నాయ్. ఇంతకీ విషయం ఏమిటంటే, స్వయంగా చంద్రబాబు చెప్పినట్లు 40 నియోజకవర్గాల్లో టిడిపి పరిస్ధితి దారుణంగా ఉంది. ఈ నియోజకవర్గాల్లో మంత్రులు, ఎంఎల్ఏలతో పాటు ఇన్చార్జిల నియోజకవర్గాలు కూడా ఉన్నాయ్. ఎక్కడెక్కడ లోపాలున్నాయి, లోపాలను సరిచేసుకునే విషయంపై ఇప్పటికే చంద్రబాబు పై నియోజకవర్గాల్లోని నేతలకు చాలాసార్లే హెచ్చరికలు చేశారు.

అయితే, సిఎం ఆశించిన విధంగా సదరు నియోజకవర్గాల్లో పెద్దగా మార్పు రాలేదట. దాంతో అటువంటి వారి స్ధానంలో కొత్తవారిని ఎంపిక చేయాలని నిర్ణయం అయిపోయిందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అయితే, టిక్కెట్లు ఇవ్వకూడదని అనుకున్న వారి విషయంలో త్వరలో చంద్రబాబు ‘విందురాజకీయాలకు’ తెరలేపనున్నట్లు సమాచారం.

సమయం వచ్చినపుడు అటువంటి వారిని తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని వారికి భోజనం పెట్టాలని నిర్ణయించారట. తానివ్వబోయే విందుకు కుటుంబం మొత్తాన్ని పిలిచి ఏ పరిస్ధితుల్లో టిక్కెట్టు ఇవ్వలేకపోతున్నది వివరించాలని చంద్రబాబు అనుకుంటున్నారట. అటువంటి వారి సేవలను పార్టీకి, అభ్యర్ధి గెలుపుకు ఉపయోగించుకోవాలని చంద్రబాబు ఉద్దేశ్యమట. ఈ విషయం బయటకు పొక్కగానే తమ్ముళ్ళల్లో విందుకు పిలుపు వచ్చేదెవరికనే విషయంలో ఆందోళన పెరిగిపోతుందట.