Asianet News TeluguAsianet News Telugu
breaking news image

ఎంపీలను వెంటబెట్టుకొని ఢిల్లీకి చంద్రబాబు.. ఏం జరుగుతుంది?

కేంద్రంలో ఎన్డీయే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 8న ప్రధానిగా నరేద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీలను వెంటబెట్టుకొని చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు...  

Chandrababu to Delhi with MPs, what will happen? GVR
Author
First Published Jun 6, 2024, 4:25 PM IST

సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారి తెలుగుదేశం పార్టీ అధినేత, జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆ పార్టీ ఎంపీలతో భేటీ అయ్యారు. అందుబాటులో ఉన్న పలువురు ఎంపీలతో ఉండవల్లిలోని తన నివాసంలో కొత్త పార్లమెంటు సభ్యులతో కలిసి సమావేశమయ్యారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కూడా ఈ సమావేశంలో ఉన్నారు. అందుబాటులోని ఇతర ఎంపీలు జూమ్ కాల్ ద్వారా సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్తగా గెలిచిన పార్లమెంటు సభ్యులందరికీ చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నెల 7న ఢిల్లీలో ఎన్‌డీయే పక్షాల సమావేశం జరగనుండగా... ఈ సమావేశానికి కూటమిలో భాగమైన తెలుగుదేశం ఎంపీలందరూ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఎంపీలు గురువారం రాత్రికే ఢిల్లీ చేరుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా, తెలుగుదేశం ఎంపీలతో కలిసి చంద్రబాబు శుక్రవారం జరిగే ఎన్‌డీయే మిత్రపక్షాల సమావేశంలో పాల్గొనబోతున్నారు. 


కాగా, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-భారతీయ జనతా పార్టీల కూటమి భారీ విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్‌లోని 25 పార్లమెంటు స్థానాల్లో 21 చోట్ల కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీ చేసిన 17 స్థానాల్లో 16 గెలుచుకున్నారు. కేంద్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజారిటీ భారతీయ జనతా పార్టీ రాలేదు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం ఎంపీలు ఎన్‌డీయే కీలకంగా మారారు. 

 

ప్రధాని నరేంద్ర మోదీని ముచ్చటగా మూడోసారి ప్రధానిని చేసే ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. జూన్ 8న అంటే శనివారం మోదీ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా నిర్వహించేందుకు ముహూర్తం ఫిక్స్‌ అయింది. ఎన్‌డీయే ప్రభుత్వం ఏర్పాటుపై ఇప్పటికే కీలక భేటీ జరిగింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌, బిహార్‌ జేడీయూ పార్టీ అధినేత నితీశ్‌ కుమార్‌ సహా పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు. ఎన్‌డీయే నేతగా నరేంద్ర మోదీని మిత్రపక్షాల నేతలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  

 

అలాగే, ఎన్డీయే మిత్రపక్షాల తొలి సమావేశంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఎంతో ప్రాధాన్యం లభించింది. ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో బీజేపీ నేతలు చంద్రబాబుకు పెద్దపీట వేశారు. నరేంద్ర మోదీకి ఒకవైపు బీజేపీ అగ్రనేతలు కూర్చుంటే, మరోవైపు చంద్రబాబు, నీతీశ్‌కుమార్‌ కూర్చున్నారు. ప్రధానితో చంద్రబాబు కాన్ఫిడెంట్ గా, సరదాగా మాట్లాడుతున్న దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios