సారాంశం

టీడీపీ చీఫ్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు రాష్ట్ర రాజకీయాలను వాడిగా వేడిగా మార్చేసింది. ఈ తరుణంలో చంద్రబాబు చరిత్ర గురించిన చర్చ కూడా మరో వైపు మొదలైంది. ఇందులో భాగంగానే చంద్రబాబుపై టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
 

హైదరాబాద్: టీడీపీ చీఫ్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నది. ఈ ఘటన చుట్టూ రాజకీయ నాయకులే కాదు.. అనేక వర్గాలు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. కొందరు ఆయన అరెస్టును ఖండిస్తుంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇదే సందర్భంలో సీనియర్ ఎన్టీర్‌ను చంద్రబాబు మోసం చేశాడనే ఎపిసోడ్ పై చర్చ మొదలైంది. ఇలా పాత విషయాలు చర్చలోకి వచ్చిన తరుణంలో చంద్రబాబు పై టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు గతంలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మోహన్ బాబు గతంలో మాట్లాడుతూ చంద్రబాబు తనకు మిత్రుడని చెప్పారు. అదే సందర్భంలో ఆయనకు అసత్యాలు చెప్పడం పుట్టుకతోనే నరనరాన జీర్ణించుకుపోయిందని అన్నారు. సీనియర్ ఎన్టీఆర్ పై చెప్పులు విసిరేసిన ఘటనకు తాను ప్రత్యక్ష సాక్షినని వివరించారు. వైస్రాయ్ హోటల్ ఘటనను ఆయన గుర్తు చేశారు.

చంద్రబాబుతో తనకు 40 ఏళ్ల అనుబంధం ఉన్నదని, అందుకే ఆయన గురించి ఇతరుల కంటే తనకు ఎక్కువ తెలుసు అని చెప్పారు. అతనికి పుట్టుకతోనే అసత్యాలు చెప్పడం నరనరాన జీర్ణించుకోపోయిందని అన్నారు. తెలుగులో నెంబర్ వన్ హీరోగా ఉన్న సమయంలోనే ఎన్టీఆర్ సినిమాలు మానేసి తన కుమారుడు హరికృష్ణతో కలిసి అవిశ్రాంతంగా తిరిగి తెలుగుదేశం పార్టీని స్థాపించారని వివరించారు. మన దేశంలోనే మహోన్నతుడిగా సీనియర్ ఎన్టీఆర్ ఎదిగారని తెలిపారు. అలాంటి మహానుభావుడు చంద్రబాబుకు కన్యాదానం చేశాడని, కానీ, ఆ మామనే చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడని మోహన్ బాబు అన్నారు. ఇంతకంటే ఘోరం ఉంటుందా? అని పేర్కొన్నారు.

సీనియర్ ఎన్టీఆర్ తనను రాజ్యసభ ఎంపీగా పంపించారని, వైశ్రాయ్ హోటల్ ఘటనున కళ్లారా చూశానని మోహన్ బాబు వివరించారు. ఏదైనా తప్పు చేసి ఉంటే తనకు చెబితే సరిదిద్దుకుంటానని సీనియర్ ఎన్టీఆర్ అడిగారని తెలిపారు. కానీ, అక్కడున్న నేతలు మాత్రం ఆయనపై చెప్పులు విసిరారని పేర్కొన్నారు. దీనికి తాను ప్రత్యక్ష సాక్షినని వివరించారు.

Also Read : హైకోర్టు లో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ పై విచారణ షురూ.. వాదనలు వినిపిస్తున్న సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే..

ఎవరినైనా వాడుకుని కరివేపాకులా పడేయడం చంద్రబాబు క్యారెక్టర్ అని, చంద్రబాబు నైజం ఇదే అని మోహన్ బాబు అన్నారు. ఇది సీనియర్ ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ కాదని, ఇది చంద్రబాబు లాక్కున్న తెలుగుదేశం పార్టీ అని విరుచుకుపడ్డారు. పంచభూతాల సాక్షిగా ఇదే వాస్తవం అని మోహన్ బాబు బల్లగుద్ది చెప్పారు. చంద్రబాబు ఎన్టీఆర్ కుటుంబాన్ని నిలువున మోసం చేశారని, పచ్చి అబద్ధాల కోరు, నీచుడని అన్నారు. ఒక మహోన్నత వ్యక్తిని వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎలా మంచోడవుతాడని అడిగారు.

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో రూ. 371 కోట్లను దారి మళ్లించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ స్కాం సూత్రధారి చంద్రబాబేనని, పక్కా ప్లాన్‌తోనే నిధులు మళ్లించినట్టు దర్యాప్తులో తేలిందని ఏపీ సీఐడీ పేర్కొంది.