అమరావతి: కేంద్రం మెడలు వంచైనా కడప ఉక్కు కర్మాగారం సాధించుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలోని నిరసన సెగ ఢిల్లీని తాకాలని ఆయన అన్నారు. విభజన హామీలపై రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. 

తెలుగుదేశం సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మంగళవారం మాట్లాడారు. ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో కేంద్రాన్ని అడగాల్సినవి అన్నీ అడిగినట్లు తెలిపారు..

కడప ఉక్కు కర్మాగారం విషయంలో సీఎం రమేష్, బీటెక్ రవి గట్టిగా పోరాడుతున్నారని ముఖ్యమంత్రి కొనియాడారు. బీటెక్ రవి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని తెలిపారు. 
బిజెపి, వైసిపిలు ఒక్కటే అని అనడానికి గాలి జనార్దన్ రెడ్డి మాటలే నిదర్శనమని వ్యాఖ్యానించారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నామని, అయితే బిజెపి, వైసిపి అడ్డుపడుతున్నాయని అన్నారు.

కడప ఉక్కుకు మద్దతుగా ఆందోళనలు, బైక్ ర్యాలీలు కొనసాగాలని సూచించారు. రేపు సైకిల్ యాత్రలు, ఎల్లుండి ధర్నాలు చేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈనెల 28న ఢిల్లీలో ఎంపీల పోరాటానికి మద్దతుగా రాష్ట్రంలోను ధర్నాలు కొనసాగాలని చెప్పారు. వైసిపి ఎంపీలు ఉపఎన్నికలను ఢిల్లీలో పోరాటాలను తప్పించుకోటానికే రాజీనామా డ్రామాలు ఆడారని దుయ్యబట్టారు.