అమరావతి: మూడు రాజధానులపై తాను చేసిన అసెంబ్లీ రద్దు విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పారిపోయాడని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు చెప్పారు. తాను చేసిన డిమాండ్ నుండి వైసీపీ పిరికి పందల్లా పారిపోయారన్నారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగిస్తే రాజీనామాలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. 
మాట తప్పినందుకు గాను అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. 

అమరావతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. అమరావతిని కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన డెడ్ లైన్  విషయంలో పారిపోయిందన్నారు. కేంద్రం కూడ ఈ విషయంలో ఏపీకి న్యాయం చేయాలన్నారు. వైసీపీలో నిజాయితీ గల నేతలంతా కూడ అమరావతికి మద్దతివ్వాలని ఆయన కోరారు. 

ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ఇచ్చిన 48 గంటల డెడ్ లైన్ బుధవారం నాడు సాయంత్రం 5 గంటలతో ముగిసింది. దీంతో బుధవారం నాడు సాయంత్రం టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడారు.

ఒక్కసారి అవకాశం ఇస్తే  ఏపీ ప్రజల భవిష్యత్తును నాశనం చేశాడని  టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ పై మండిపడ్డారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఎన్నికల సమయంలో జగన్ ప్రచారం చేశాడని ఆయన గుర్తు చేశాడు. 

ఒక్కసారి అవకాశం ఇస్తామంటే కరెంటు తీగను పట్టుకొంటారా అని తాను చెప్పినా కూడ ప్రజలు పట్టించుకోలేదన్నారు. ప్రజలు నమ్మి వైసీపీకి అధికారాన్ని కట్టబెడితే  ప్రజల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 

also read:అమరావతికి జై కొడితే రాజీనామాలకు సై: బాబు ప్లాన్ ఇదీ...

తాను చేస్తున్న పోరాటం నా కోసం కాదు, మా పార్టీ కోసం కాదని ఆయన  ప్రజలకు గుర్తు చేశారు. ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉందన్నారు.అమరావతిలోనే రాజధాని ఉంటుందని వైసీపీ నేతలు ప్రకటించిన వీడియో క్లిప్పింగ్ లను ఆయన ఈ సమావేశంలో ఆయన ప్రస్తావించారు.

వైఎస్ జగన్ అమరావతి విషయంలో మాట తప్పారు. మడమ తిప్పారని బాబు విమర్శించారు.  మూడు రాజధానుల విషయంలో ప్రజలకు చెప్పకుండా ఎందుకు మార్చారని ఆయన ప్రశ్నించారు.

ఎన్నికలకు ముందు ప్రజలకు జగన్ మూడు రాజధానుల గురించి ఎందుకు చెప్పలేదని ఆయన జగన్ ను అడిగారు.ప్రజలకు ద్రోహం చేయడం నీచమన్నారు.  ప్రజల్లో చైతన్యం, తిరుగుబాటు రావాల్సిన అవసరం ఉందన్నారు.

ఇప్పటికైనా డ్రామాలు చేయడం ఆపాలని ఆయన వైసీపీ నేతలను కోరారు. అమరావతిలోనే రాజధాని ఎందుకు ఉండాలనే విషయమై తాను రెండు రోజులకో ఓసారి ప్రజల ముందు అన్ని విషయాలను పెడతానని ఆయన చెప్పారు. ఈ విషయాలపై చర్చించాలన్నారు. తాను చెప్పిన అంశాలను ప్రజలంతా చర్చించి ఏది మంచో చెడో నిర్ణయాన్ని మీరే తీసుకోవాలని ఆయన ప్రజలను కోరారు.

ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని విషయాల్లో కేంద్రం జోక్యం చేసుకొనే అవకాశం ఉంటుంది. అదే అధికారాన్ని ఆసరాగా చేసుకొని అమరావతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.