అమరావతి: తమ పార్టీ నేత, అనంతపురం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చమన్ భార్య రమీజాబీతో తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. చమన్ గుండెపోటుతో ఆకస్మికంగా మరణించిన విషయం తెలిసిందే. 

పరిటాల కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన చమన్ మృతి పట్ల పరిటాల అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. మంత్రి పరిటాల సునీత సొమ్మసిల్లి పడిపోయారు. చమన్ భార్య రమీజాబీతో చంద్రబాబు ఫోన్ లో మాట్లాడారు. 

చమన్ కుటుంబానికి అండగా ఉంటామని, చమన్ చిరకాల వాంఛ తన కుమారుడిని ఎంబిబిఎస్ చదివించడమని, ఆ చిరకాల వాంఛను మేరకు కుమారుడు ఉమర్ ముక్తాను తాను ఎంబిబిఎస్ చదివిస్తానని చంద్రబాబు చెప్పారు. 

చమన్ అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం ఆయన స్వగ్రామం రామగిరి మండలం ఆర్. కొత్తపల్లిలో జరుగుతాయి. ఈ అంత్యక్రియలకు టీడీపి కార్యకర్తలు, పరిటాల అభిమానులు హాజరవుతారు.