విశాఖపట్టణం:రాష్ట్రంలో దళితులపై దాడులు జరగని రోజే లేదని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఆరోపించారు. తొలి దాడి జరిగిన సమయంలోనే నిందితులను కఠినంగా శిక్షిస్తే ఇలాంటి ఘటనలు పునరావృతం కావని ఆయన అభిప్రాయపడ్డారు.

విశాఖ జిల్లా టీడీపీ నేతలు, దళిత సంఘాల నేతలతో చంద్రబాబునాయుడు ఆదివారం నాడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. టిడిపి హయాంలో ఈ దమనకాండ దళితులపై ఉందా..? అని ఆయన ప్రశ్నించారు. 2నెలల్లో 2జిల్లాల్లో ఇద్దరు దళిత యువకులకు శిరోముండనాలు జరగడంపై ఆయన మండిపడ్డారు.

దళితులపై దాడిచేసి, దానిని వీడియో తీయడం ఉన్మాద చర్యగా ఆయన అభిప్రాయపడ్డారు. దళితులపై దాడులు చేయడం వాటిని వీడియో తీయడం నిందితుల బరితెగింపుగా ఆయన అభివర్ణించారు. ఉన్మాదుల పాలన ఎలా ఉంటుందో దళితులపై వరుస దాడులే నిదర్శనంగా చంద్రబాబు పేర్కొన్నారు.

జగన్ అండ ఉందనే అహంతో నేరగాళ్ల కళ్లు నెత్తికెక్కాయన్నారు. హత్యలు, శిరోముండనాలు, గ్యాంగ్ రేప్ లు, బెదిరింపులు, వేధింపులకు అంతేలేదని చెప్పారు.
దళితులపై దాడులను జగన్ ఎందుకని ఖండించడం లేదని ఆయన ప్రశ్నించారు. 

వైసిపి నాయకుల దమనకాండకు జగన్ బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.శంకర్రావు భూమిని లాక్కోవడం హేయం. రాష్ట్రంలో దళితుల ధన,మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.

నిన్న వెలిగోడులో దళిత మహిళపై వైసిపి నాయకుడి దాడి. మొన్న పుంగనూరులో దళిత యువకుడి ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
వైసిపి గద్దె ఎక్కాక దళితుల ప్రాణాలకే భద్రత లేకుండా పోయిందన్నారు.

జగన్ కు చేయాల్సింది పాలాభిషేకాలు కాదు.. దళితులపై దాడులతో జగన్ కు రోజూ రక్తాభిషేకాలేనని ఆయన చెప్పారు.పుంగనూరులో దళిత యువకుడు ఓం ప్రతాప్ ది మొదట ఆత్మహత్య అన్నారు. తర్వాత సహజ మరణం అన్నారు. హడావుడి చేసి అంత్యక్రియలు జరిపించారని ఆయన మండిపడ్డారు.
. ప్రజల్లో వ్యతిరేకత రావడంతో మృతదేహం బైటకు తీసి పోస్ట్ మార్టమ్ జరిపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఓంప్రకాష్  వంటిమీద కాల్చిన వాతలు ఉన్నాయి. ట్రాక్టర్ బోల్తాపడి చనిపోతే మృతదేహంపై వాతలు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. దళితులపై దాడులు ఆగేదాకా ఎవరూ వెనుకడుగు వేయరాదు.  నిరసనలతో వైసిపి ప్రభుత్వం కళ్లు తెరిపించాలని ఆయన పార్టీ నేతలను కోరారు.