అమరావతి: పంచాయితీ ఎన్నికల్లో అధికార వైసిపి ప్రత్యర్థి పార్టీలపైనే కాదు సామాన్య ప్రజలపైనా దౌర్జన్యానికి పాల్పడుతోందని మాజీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థికి ఓటేయ్యలేదని ఓ సామాన్యుడి ఇంటిని జెసిబితో ధ్వంసం చేయడానికి ప్రయత్నించారని... దీంతో అతడు ప్రాణాలకు తెగించి అడ్డుకున్నాడని అన్నారు.  అందుకు సంబంధించిన ఫోటోను జతచేస్తూ చంద్రబాబు ట్వీట్ చేశారు. 

''నరసరావుపేట నియోజకవర్గం రొంపిచర్ల మండలం ఇస్సాపాలెం పరిధిలో వైసీపీకి ఓటు వెయ్యలేదని ఇళ్ల ముందు ఉండే డ్రైనేజీ మెట్లు, ర్యాంపులను పంచాయితీ సెక్రెటరీ మరియు పోలీస్ అధికారులు దగ్గరుండి కూలగొట్టించడం దారుణం. ఇలాంటి ఆటవిక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను'' అంటూ బాధితుడు కూల్చివేతలను అడ్డుపడుతూ జెసిబికి అడ్డుగా పడుకున్న ఫోటోను జతచేస్తూ చంద్రబాబు ట్వీట్ చేశారు. 
 
''గోగులపాడు పంచాయతీ 5వ వార్డులో తెలుగుదేశం బలపరచిన అభ్యర్థి గెలిచినందుకు వైసీపీ ప్రభుత్వం తీర్చుకున్న ప్రతీకారం ఇది. ప్రజలు ప్రత్యర్థిని గెలిపిస్తే వారిపై పగబట్టి, వారి వ్యక్తిగత ఆస్తులను కూల్చుతారా? ఇలాంటి రాజకీయాన్ని రాజారెడ్డి రాజ్యాంగం నేర్పిందా?'' అంటూ సీఎం జగన్ ను నిలదీశారు చంద్రబాబు.