మిగులు విద్యుత్ రాష్ట్రంలో కరెంట్ కోతలు జగన్ రెడ్డి అసమర్ధ పాలనకు నిదర్శనమని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఇవాళ స్ట్రాటజీ కమిటీ సమావేశంలో టిడిపి ముఖ్య నాయకులతో చంద్రబాబు వివిధ అంశాలపై చర్చించారు. 

అమరావతి: జగన్ తన అసమర్థ పాలనతో యువత భవిష్యత్ కాలరాసాడని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రం లో పెట్టుబడులు లేక, పరిశ్రమలు రాక, ఉపాధి దొరక్క యువత ఫ్యూచర్ అగమ్య గోచరంగా మారిందని అన్నారు. జగన్ తమకు చేసిన నష్టంపై యువత తీవ్ర అవేదన, అసంతృప్తి తో ఉన్నారని చంద్రబాబు పేర్కొన్నారు. 

''ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ఏ ఒక్కరు రోడ్డెక్కినా... వారిని అణచివేయడమే లక్ష్యంగా జగన్ రెడ్డి పాలన సాగిస్తున్నారు. నిన్నటి వరకు ప్రతిపక్షాలను వేదించారు... ఇప్పుడు ఉద్యోగులు, ఉపాధ్యాయులు హక్కులు కాపాడాలని నిరసనకు సిద్ధమైతే అరాచకంగా అరెస్టులు చేస్తున్నారు'' అని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేసారు. 

''పోలవరం ప్రాజెక్ట్ ను జగన్ ప్రభుత్వం తన అసమర్ధతకు బలి చేసింది. డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే మూడేళ్లు జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది. పోలవరం అథారిటీ, కేంద్ర ప్రభుత్వం తప్పుబట్టినా.. మూర్ఖంగా ముందుకు వెళ్లి ప్రాజెక్ట్ ని నాశనం చేశారు. డయాఫ్రం వాల్ ఎందుకు కూలిందో చెప్పకుండా తెలుగుదేశంపై ఆరోపణలు చేస్తున్నారు'' అని అన్నారు. 

''రాష్ట్రంలో పేదరికాన్ని, అసమానతల్ని నిర్మూలించడమే ధ్యేయంగా ఎన్నో చర్యలు తీసుకున్నాం. ఆ రోజు జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటు చేసి రెండు గ్లాసుల సిద్ధాంతాన్ని రద్దు చేశాం. ఎస్సీ, ఎస్టీ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించి కులాల మధ్య అంతరాలను తొలగించాం. రెసిడెన్షియల్ స్కూల్స్ నుండి... విదేశీ విద్య వరకు తెచ్చిన సంస్కరణలు ఈ రోజు ప్రజలు ఫలితాలు చూస్తున్నారు. కానీ జగన్ రెడ్డి వారికి చేసిందేమీ లేకపోయినా రాజకీయంగా వాడుకుంటూ టిడిపిపై వ్యతిరేకత సృష్టిస్తున్నారు'' అని చంద్రబాబు అన్నారు.

''గతంలో పీఆర్సీ విషయంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేపట్టిన ఉద్యమానికి నేడు సీపీఎస్ ఉద్యమంపై ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంటోంది. హక్కుల కోసం ఐక్య పోరాటం చేయడానికి కూడా వీల్లేదు అనేలా అరెస్టులు చేస్తున్నారు. హక్కుల కోసం రోడ్డెక్కడం తప్పా.? దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా సంవత్సరాన్ని జూన్ 12 నుండి జులై 8కి మార్చడం ఏంటి? స్కూళ్లను మూసివేయడం వంటి విధానాలతో విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారు'' అని ఆరోపించారు. 

''మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రంలో విద్యుత్ కోతలు నెలకొన్నాయి. ఫలితంగా వ్యవసాయం, పరిశ్రమలు, ఆక్వా దెబ్బతినడంతో ఆదాయం తీవ్రంగా పడిపోయింది. ఇక రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయి. రాష్ట్రంలో 800 మందికి పైగా మహిళలపై తీవ్ర స్థాయి నేరాలు చోటు చేసుకుంటే.. ఎంత మందికి న్యాయం చేశారో, ఎందరిని శిక్షించారో సమాధానం చెప్పాలి'' అని చంద్రబాబు ప్రశ్నించారు. 

స్ట్రాటజీ కమిటీలో చర్చించిన అంశాలు:

1. నెల్లూరులో మంత్రి కాకాణి కేసుకు సంబంధించిన సాక్ష్యాలు దొంగిలించడబడడం దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. నేరస్తులకు కొత్త కొత్తగా నేరాలు చేయడానికి వైసీపీ ప్రభుత్వం మార్గాలు చూపిస్తోంది.

2. టీడీపీ చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి.

3. టీడీపీ మెంబర్ షిప్ కార్యక్రమం యుద్ధ ప్రాతిపాదికగా పూర్తి చేయాలి. తెలుగుదేశం పార్టీతో ఉండే ప్రతి కుటుంబ సభ్యుడూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని తీసుకునేలా ప్రోత్సహించాలి.

4. అనుబంధ కమిటీల్లో యువతకు అధిక ప్రాధాన్యం కల్పించడం. గ్రామ స్థాయిలో అన్ని కమిటీల్లో యువత అధికంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి.

5. అత్యాచార బాధితులకు న్యాయం చేయకుండా.. ప్రశ్నించిన వారిపై రాజకీయ కక్ష సాధింపులకు దిగుతున్న మహిళా కమిషన్ వ్యవహార శైలిపై అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాల కారణంగానే రాష్ట్రంలో మహిళల పట్ల దాడులు, అఘాయిత్యాలు పెరుగుతున్నా ప్రతిపక్షాలపై కక్ష సాధింపులకు దిగడాన్ని తప్పుబట్టారు.

6. రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురిసినప్పటికీ తాగునీటి కష్టాలు ఎదురవడానికి ప్రభుత్వ అసమర్ధ విధానాలే కారణమన్నారు.

7. తిరుమల వెళ్తున్న భక్తుల కారును బలవంతంగా లాక్కోవడమే కాకుండా...ఇప్పుడు ఆ కుటుంబాన్ని విచారణ పేరుతో వేదించడం దారుణం. ఈ విషయంలో బాధిత కుటుంబానికి క్షమాపణ చెప్పాల్సింది పోయి.... నోటీసులతో వేదిస్తారా?

ఇలా వివిధ అంశాలపై చర్చించి వైసిపి ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించారు టిడిపి నాయకులు.