కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఏపికి అన్యాయం చేస్తోందని చంద్రబాబునాయుడు మండిపడ్డారు. అమరావతిలోని దర్బార్ హాలులో మంగళవారం జరిగిన పార్టీ సమన్వయ సమావేశం జరిగింది. ఆ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్ర విభజన పేరుతో అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తే, బిజెపి కూడా ఇపుడు అన్యాయమే చేస్తోందన్నారు. రెండు పార్టీల వల్ల ఏపి పరిస్ధితి ‘పెనం మీదనుండి పొయ్యిలోకి పడ్డినట్లైం’ది అని వాపోయారు.

మూడేళ్ళుగా కేంద్రం నుండి ఆశించిన సాయం అందకపోయినా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. మనకు న్యాయం జరిగేవరకూ పోరాటం చేయాల్సిందేనంటూ నేతలకు పిలిపిచ్చారు. ఏపికి న్యాయం చేయకుండా జాతీయ స్ధాయిలో రెండు పార్టీలు మనుగడ ఎలా సాధ్యమంటూ నిలదీసారు.

పోరాటమని, అన్యాయమని, పెనంలో నుండి పొయ్యిలోకి అని చెబుతూనే కేంద్రంపై విమర్శలు చేసేటపుడు సంయమనం అవసరమన్నారు. వ్యక్తిగత విమర్శలు చేయటం మన అజెండా కాదన్నారు.

అవిశ్వాస తీర్మానానికి 54 మంది ఎంపిల మద్దతు కావాలన్న చంద్రబాబు కేంద్రానికి మెజారిటీ ఉన్నపుడు మనం చేయగలిగేది ఏమీ లేదని స్పష్టం చేశారు. దాంతో వైసిపి ప్రవేశపెడతామన్న అవిశ్వాస తీర్మానికి టిడిపికి సంబంధం లేదని చెప్పినట్లైంది. సరే, పనిలో పనిగా వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. అన్నీ పార్టీల మద్దతు కూడగట్టి కేంద్రంపై ఒత్తిడి పెంచటమే మార్గమన్నారు.