అమరావతి: ఎల్జీ పాలీమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటన జరిగిన తర్వాత తాను విశాఖపట్నం ఎందుకు సందర్శించలేకపోయాననే విషయాన్ని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వివరించారు. జూమ్ ద్వారా బుధవారం ప్రారంభమైన టీడీపీ మహానాడులో ఆయన ఆ విషయం చెప్పారు. ఎల్జీ పాలీమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో మరణించినవారికి సంతాపం ప్రకటిస్తూ మహానాడులో తీర్మానం చేశారు. 

గ్యాస్ లీక్ దుర్ఘటన జరిగిన వెంటనే తాను విశాఖపట్నం సందర్శించాలని అనుకున్నాని, అందుకు కేంద్రం అనుమతి కోరానని, అందుకు కేంద్రం నుంచి అప్పట్లో అనుమతి రాలేదని ఆయన చెప్పారు. విశాఖపట్నం సందర్శించడానికి తాను తాజాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరినట్లు ఆయన తెలిపారు. 

ఇప్పటి వరకు కూడా గ్యాస్ లీక్ ఘటనపై శాస్త్రీయ పరిజ్ఢానం లేదని ఆయన చెప్పారు. బాధితులకు అండగా ఉన్న ప్రతిపక్షాల నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేయడంపై ఆయన మండిపడ్డారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినవారిపై కేసులు పెట్టారని ఆయన మండిపడ్డారు. మృతుల కుటుంబాలకు రూ. 50 వేల రూపాయలేసి నష్టపరిహారం ఇవ్వనుున్నట్లు ఆయన తెలిపారు.

పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు పార్టీ పతాకను ఆవిష్కరించి మహానాడును ప్రారంభించారు. ఉభయ రాష్ట్రాలకు చెందిన నాయకులు, విదేశీ ప్రతినిధులు, కార్యకర్తలు దాదాపు 14 వేల మంది జూమ్ యాప్ ద్వారా మహానాడులో భాగస్వాములయ్యారు. 

యూట్యూబ్, పేస్ బుక్ లైవ్ ద్వారా మరో 10 వేల మంది భాగస్వాములను చేస్తూ ఇలాంటి కార్యక్రమం చేపట్టడం దేశంలో ఇదే తొలిసారి. రాష్ట్రంలో ప్రధాన సమస్యలపై మహానాడు చర్చిస్తుందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు చెప్పారు.