నారావారిపల్లెలో వైసీపీ సభ: చంద్రబాబు స్పందన ఇదీ
మూడు రాజధానుల ప్రతిపాదనకు మద్దతుగా తన స్వగ్రామం నారావారిపల్లెలో వైసీపీ సభ నిర్వహించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. తన ఊరివాళ్లు వైజాగ్ వెళ్లాలనుకుంటారా అని చంద్రబాబు ప్రశ్నించారు.
అమరావతి: మూడు రాజధానుల ప్రతిపాదనకు అనుకూలంగా వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నారావారిపల్లెలో సభ నిర్వహించడంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. వైసీపి సభపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు.
"బుద్ధి ఉన్నవారు ఎవరైనా మా ఊరి నుంచి వైజాగ్ వెళ్లాలని అనుకుంటారా, మంత్రులకు కనీసం ఆలోచన లేదా, మా ఊరివాళ్లు అమరావతిని దాటి వైజాగ్ వెళ్లాలని ఆలోచిస్తారా" అని చంద్రబాబు ప్రశ్నల వర్షం కురిపించారు. ఆ ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు.
వందశాతం అలా అనుకోరని ఆయన చెప్పారు. అలాంటప్పుడు మూడు రాజధానులకు మద్దతుగా మా ఊరిలో వైసీపీ సభ నిర్వహిస్తే ప్రజలు ఎలా వస్తారని ఆయన అడిగారు. జగన్ పాలనలో రాష్ట్రం బీహార్ కన్నా చెత్తగా తయారైందని ఆయన అన్నారు. ఆరోగ్యం బాగుంటే మరో 15 ఏళ్లు జీవిస్తానని, అయినా తన గురించి తాను ఆలోచించడం లేదని, తన ఆందోళన అంతా రాష్ట్రం గురించేనని ఆయన అన్నారు.
Also Read: ఆరోగ్యం బాగుంటే ఉంటా.. నా పోరు భావి తరాల కోసం: బాబు ఉద్వేగం
అమరావతి విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అననుసరిస్తున్న తీరును జాతీయ మీడియా కూడా ఎండగడుతోందని ఆయన అన్నారు. మూడు రాజధానుల నిర్ణయం సరైంది కాదని ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్ కూడా రాసిందని ఆయన గుర్తు చేశారు. రాజధానికి రుణాల విషయంలో ప్రపంచ బ్యాంక్, ఆసియా బ్యాంక్ వెనక్కి వెళ్లడం మంచిది కాదని రాసిందని ఆయన చెప్పారు.
ద హిందూ, ట్రిబ్యూన్ సహా దేశంలోని ప్రముఖ జాతీయ పత్రికలు జగన్ తీరును తప్పు పట్టాయని ఆయన చెప్పారు. నియంతృత్వ పోకడలు సరైంది కాదని టెలిగ్రాఫ్ పత్రిక రాసిందని చెప్పారు. ఆయా పత్రికల కథనాలకు సంబంధించిన క్లిప్పింగులను ఆయన మీడియా సమావేశంలో ప్రద్సించారు.