విశాఖపట్నం సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ పార్టీని వీడటంపై టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రలోభాలకు లోనై పార్టీకి ద్రోహం చేయడం హేయమని బాబు వ్యాఖ్యానించారు.

వ్యక్తిగత స్వార్థంతో పార్టీకి ద్రోహం చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. స్వార్ధంతో ఒకరిద్దరు పార్టీ నుంచి పోయినా నష్టం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.

పార్టీకి ద్రోహం చేసినవాళ్లకు రాజకీయ సమాధేనని, విశాఖపట్నం తెలుగుదేశం పార్టీకి కంచుకోట వంటిదని టీడీపీ చీఫ్ తెలిపారు. హుదుద్‌ సమయంలో టీడీపీ కష్టాన్ని ప్రజలు మర్చిపోరని చంద్రబాబు ఆకాంక్షించారు.

శనివారం విశాఖ సౌత్ టీడీపీ ఎమ్మెల్యే వాసుపత్లి గణేశ్ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా జగన్ సమక్షంలో వాసుపల్లి కుమారులు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు.

Also Read:ఏపీలో ఇక ప్రతిపక్షమే ఉండదు: విజయసాయి సంచలన వ్యాఖ్యలు

అనంతరం గణేశ్ మాట్లాడుతూ..తన కుమారులు వైసీపీలో చేరడం చాలా ఆనందంగా ఉందన్నారు. విశాఖలో రాజధాని ఆహ్వానించదగ్గ విషయమని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరానని గణేశ్ స్పష్టం చేశారు.

రాష్ట్రాన్ని జగన్ ముందుకు తీసుకెళ్తున్నారని... అనేక సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అందరికీ చేరుతున్నాయని ఆయన వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ ఇక ముందుకు వస్తోందని తనకు అనిపించడం లేదని గణేశ్ అభిప్రాయపడ్డారు.

విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌‌ను ఇచ్చిన ఘనత జగన్‌దేనని వాసుపల్లి వెల్లడించారు. తన నియోజకవర్గంలో అనేక పనులన్నాయని.. అవన్నీ జగన్‌తోనే సాధ్యమవుతాయని ఆయన స్పష్టం చేశారు.