వాళ్లకూ నీకూ తేడా ఏమిటి: జగన్ ను ప్రశ్నించిన చంద్రబాబు

Chandrababu questions YS Jagan on corruption
Highlights

విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, అగ్రిగోల్డ్ నిందితులతో మీకున్న తేడా ఏమిటని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. 

అమరావతి: విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, అగ్రిగోల్డ్ నిందితులతో మీకున్న తేడా ఏమిటని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. ఆయన శనివారం సాయంత్రం సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడారు. ప్రజలను మోసం చేసిన అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేస్తున్నామని చెబుతూ మీ ఆస్తులను ఎందుకు వేలం వేయకూడదని, మీది అవినీతి సొమ్ము కాదా అని ఆయన జగన్ ను అడిగారు. 

ఐదు ఎంపీ సీట్లను చూపించి, కేంద్రంతో లాలూచీ పడి తమపై జగన్ అవినీతి ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. వైసిపి నేతలు బొత్స సత్యనారాయణ, విజయసాయి రెడ్డి, జగన్, ధర్మాన ప్రసాదరావుల చరిత్ర ఏమిటిని ప్రశ్నిస్తూ వారిపై ఆరోపణలు రుజువయ్యాయని ఆయన అన్నారు. వారు తమపై అవినీతి ఆరోపణలు చేస్తారా అని అడిగారు. 

ఇది ఎన్నికల సంవత్సరమని, అందువల్ల కుట్రలూ కుతంత్రాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. న్యాయమైన హక్కుల కోసం రాజీలేని పోరాటం చేయాలని అన్నారు. తమవి గొంతెమ్మ కోరికలు కావలని అన్నారు. విభజన హామీలను అమలు చేస్తూ ప్రత్యేక హోదా ఇచ్చినా తమకు తక్కువేనని, అవన్నీ ఇచ్చినా రాష్ట్రం అభివృద్ధి చెందడానికి రాత్రింబవళ్లు కష్టపడాల్సి ఉంటుందని అన్నారు. 

రాష్ట్రం అవినీతిపరుల చేతుల్తోకి వెళ్తే మరో బీహార్ అవుతుందని అన్నారు. గాడి తప్పిన పాలనను గాడిలో పెట్టామని అన్నారు. అవినీతి ఎక్కడ ఉందని అడిగారు. ఏమైనా అంటే ఇసుక, మట్టి అంటారని అన్నారు. కావాలంటే మీరు రాజకీయావసరాల కోసం, లాలూచీ రాజకీయాల కోసం ఏమైనా చేయండి గానీ నన్ను విమర్శించే నైతిక హక్కు మీకు లేదని ఆయన అన్నారు. వ్యక్తిత్వంలోనూ నిజాయితీలోనూ తనను విమర్శించే నైతిక హక్కు వారికి లేదని అన్నారు. 

మోడీ దేశాన్నంత నమ్మించి అధికారం చేపట్టారని, ఆ తర్వాత ప్రజలు కష్టాల్లో పడ్డారని, మోడీ నిర్ణయాల వల్ల ప్రజలకు తాము కష్టపడి బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులను కూడా తీసుకోలేకపోతున్నారని అన్నారు. వాళ్లు ఇక్కడికి వచ్చి ఏం చేస్తారని అడిగారు. 

పదకొండు కేసులు... ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు.. వాళ్లు నా గురించి మాట్లాడుతారా అని ఆయన జగన్ ను అడిగారు.  అధికారులను ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. వారి సహకారం లేకుండా ఇలా ముందుకు సాగి ఉండేవాళ్లం కాదని అన్నారు. వేసిన పునాది, తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ఆయన చెప్పారు. 

అగ్రిగోల్డ్ ఆస్తులు వేలం వేస్తున్నామని చెబుతూ అగ్రిగోల్డ్ కు ఓ రూల్, వారికి ఓ రూలా అని జగన్ ను ఉద్దేశించి ప్రశ్నించారు. మీవి అవినీతి అస్తులు కావా అడిగారు. అవినీతి వల్ల పారిశ్రామికవేత్తలు, ఐఎఎస్ అధికారులు జైలుకు వెళ్లారని అన్నారు. 

నవనిర్మాణ దీక్షలో భాగంగా తాను గ్రామాలు తిరిగానని, అది తనకు ఎంతో అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చిందని, అన్ని వర్గాల ప్రజలు తమ ప్రభుత్వం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. 

loader