అమరావతి: విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం తీరుపై ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసారు. విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో కూతురును పోగొట్టుకున్న తల్లి అధికారుల వద్ద ఆవేదన వ్యక్తం చేసిందని, ఆమెపై పోలీసులు కేసు పెట్టారని, అది హేయమని ఆయన అన్నారు. 

నాకు కోటి రూపాయలు వద్దు.. నా కూతురుని తెచ్చివ్వండని ఓ తల్లి ఆవేదనతో మాట్లాడడం నేరమా అని చంద్రబాబు ప్రశ్నించారు. దానికి కేసు పెడుతారా అని అడిగారు. విషం చిమ్మిన పరిశ్రమను వదిలేసి దానిపై నిరసన తెలిపిన బాధితులపై, టీడీపీ నేతలపై, ఇతర పార్టీల నేతలపై కేసులు పెట్టడం ప్రభుత్వ దుర్మార్గపు చర్యకు నిదర్శనమని ఆయన అన్నారు. 

ఇప్పటికైనా ప్రభుత్వం విజ్ఞత ప్రదర్శించి తప్పుడు కేసులు ఎత్తేయాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం ఆయన అన్ని జిల్లాలో టీడీపీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో స్టైరిన్ ఉత్పత్తికి వైసీపీ ప్రభుత్వమే అనుమతులు ఇచ్చిందని, కేంద్రానికి కూడా సిఫార్సు చేసిందని టీడీపీ నేతలు చెప్పారు. 

టీడీపీ హయాంలో కేవలం ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్ ఉత్పత్తులకే అనుమతులు ఇచ్చామని, దానికి స్టైరిన్ అవసరం లేదని వారు చెప్పారు. లీకేజీ ఘటన విషయంలో నిందితుల పట్ల సానుకూల ధోరణితో జగన్ మాట్లాడారని వారన్నారు. దానివల్ల కేసు నీరు గారుతుందని వారన్నారు. 

విశాఖను నిత్యం గబ్బిలంలా పట్టుకుని వేలాడే విజయసాయి రెడ్డి ఇప్పుడు ఏ కలుగులో దాక్కున్నారని టీడీపీ నేతలు ప్రశ్నించారు. కంపెనీ డైరెక్టర్ రవీంద్రనాథ్ రెడ్డికి, ఆయనకు మధ్య ఉన్న సంబంధాలేమిటని ప్రశ్నించారు.