Asianet News TeluguAsianet News Telugu

దళిత యువకుడి మృతి: జగన్ ప్రభుత్వానికి చంద్రబాబు ప్రశ్నల వెల్లువ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళిత యువకులపై జరుగుతున్న దాష్టీకాలపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి సీఎం వైెఎస్ జగన్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఓం ప్రతాప్ మృతిపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Chandrababu questions on Dalit youth death case in Chittoor district
Author
Amaravathi, First Published Aug 29, 2020, 11:46 AM IST

అమరావతి: చిత్తూరు టిడిపి నాయకుల గృహ నిర్బంధాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఖండించారు. టీడీపీ దళిత నేతలతో చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. టిడిపి పట్టుబట్టడం వల్లే ఓం ప్రతాప్ మృతదేహానికి పోస్ట్ మార్టమ్ జరిపారని, హడావుడిగా అంత్యక్రియలు జరపడం ఒక తప్పు అని ఆయన అన్నారు.  రహస్యంగా పోస్ట్ మార్టమ్ జరపడం ఇంకో తప్పు అని అన్నారు. మృతుడి సెల్ ఫోన్ ను పోలీసులే లాగేసుకోవడం మరో తప్పు అని చంద్రబాబు అన్నారు. 

కేసు లేకపోతే ఓం ప్రతాప్ సెల్ ఫోన్ ఎందుకు తీసుకెళ్లారని అడిగారు. ఈ కేసులో మృతుడు ఓం ప్రతాప్ కాల్ లిస్ట్ కీలకమని అన్నారు. ఓం ప్రతాప్ కాల్ లిస్ట్ ను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. అప్పుడే బెదిరింపులన్నీ బయటకు వస్తాయని ఆయన అన్నారు. బెదిరించి, ప్రలోభాలు పెట్టి జరిగిన నేరాన్ని కప్పి పెట్టలేరని అన్నారు.

చౌటపల్లిలో మరో దళితుడి ప్రాణాలు తీశారని, ట్రాక్టర్ బోల్తాపడి చనిపోయాడని నమ్మించారని అంటూ ట్రాక్టర్ బోల్తాపడి చనిపోతే ఒళ్లంతా కాలిన గాయాలు ఎలా ఉన్నాయని అడిగారు.గతంలో ట్రిపుల్ మర్డర్ ను మించిన నేరాలు చిత్తూరులో జరుగుతున్నాయని, చిత్తూరులో దళితులపై దమనకాండకు మంత్రి పెద్దిరెడ్డి అరాచకాలే కారణమని చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లాలో దళితుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. 

3 నెలల్లో వరుసగా 2 జిల్లాల్లో శిరో ముండనాలు మానవత్వానికే సిగ్గుచేటు అని అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో వర ప్రసాద్ శిరో ముండనం, విశాఖలో శ్రీకాంత్ శిరోముండనం.. వైసిపి ప్రభుత్వానికి సిగ్గుచేటని చంద్రబాబు అన్నారు. వరప్రసాద్ శిరోముండనం ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేస్తే,  ఇప్పుడీ విశాఖ శ్రీకాంత్ శిరో ముండనం జరిగేదా అని అడిగారు. వరుస శిరో ముండనాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలని అన్నారు. 

15 నెలలుగా దళితులపై గొలుసుకట్టు దాడులు చేస్తున్నారని, దళితుల ప్రాణాలంటే వైసిపి నాయకులకు చులకనగా మారిందని అన్నారు. ఎవరి ఓట్లతో అయితే గద్దె ఎక్కారో, వాళ్ల ప్రాణాలే బలిగొనడం రాక్షసత్వమని అన్నారు. జగన్ అండతోనే అన్ని జిల్లాలలో అరాచక శక్తులు పేట్రేగి పోతున్నాయని చంద్రబాబు విమర్శించారు. టిడిపి ప్రభుత్వ హయాంలో దళితుల హక్కులు కాపాడామని అన్నారు. 

రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న గొలుసుకట్టు దాడుల నేపథ్యంలో శనివారం ఉదయం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు టిడిపి దళిత  నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు, ఎస్సీ సెల్ నాయకులు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు పులివర్తి నాని, అమరనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ దొరబాబు, అనిశారెడ్డి, శ్రీనాథ్ రెడ్డి తదితరుల హౌస్ అరెస్ట్ చేయడాన్ని చంద్రబాబు ఖండించారు. 

ఈ టెలికాన్ఫరెన్స్ లో చిత్తూరు జిల్లా టిడిపి నేతలు అమరనాథ్ రెడ్డి, కిశోర్ కుమార్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, దొరబాబు, మాజీ మంత్రులు జవహర్, నక్కా ఆనంద్ బాబు, ఎమ్మెల్యే డిబివి స్వామి, విజయ్ కుమార్, దేవతోటి నాగరాజు  తదితరులు పాల్గొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios