చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంలో రేపు విచారణ.. ఎల్లుండి నుంచి కోర్టుకు సెలవులు
సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై రేపు విచారణ జరగనుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తెలిపారు. నిన్న స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయగా.. ఇవాళ విచారణకు వస్తుందని అనుకున్నారు. కానీ, అది రేపటికి వాయిదా పడింది. ఎల్లుండి నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు సుప్రీంకోర్టుకు సెలవులు ఉండటం గమనార్హం.

న్యూఢిల్లీ: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రిమాండ్‌లో ఉన్న టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు దరఖాస్తు చేసుకున్న క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో రేపు విచారణ జరగనుంది. చంద్రబాబు నాయుడి క్వాష్ పిటిషన్ పై రేపు విచారిస్తామని సీజేఐ తెలిపారు. ఈ పిటిషన్‌ను విచారించే ధర్మాసనానికి సంబంధించిన వివరాలు సాయంత్రానికి వెల్లడవుతాయి. ఈ రోజు రాజ్యాంగ ధర్మాసనం విచారణ ఉన్నందున సాధారణ కేసుల విచారణ ఉండదని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఇది వరకే పేర్కొంది.
క్వాష్ పిటిషన్‌ను చంద్రబాబు నాయుడి తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టులో మంగళవారమే దాఖలు చేశారు. ఈ రోజు ఆ పిటిషన్ పై విచారణ ఉంటుందని అనుకున్నారు. కానీ, రేపు విచారిస్తామని సీజేఐ డీవై చంద్రచూడ్ తెలిపారు. అయితే.. ఎల్లుండి నుంచి అంటే సెప్టెంబ్ 28వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సుప్రీంకోర్టుకు సెలవులు ఉన్నాయి. దీంతో రేపు జరిగే విచారణపై ఉత్కంఠ నెలకొని ఉన్నది.
క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడికి సెక్షన్ 17 ఏ వర్తించదని పేర్కొంది. అయితే, హైకోర్టు తీర్పును చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో సవాల్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడికి ఈ సెక్షన్ వర్తిస్తుందని, ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.