‘స్కిల్’ సెంటర్‌కు వెళ్లుతుండగా టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను అరెస్టు చేసిన పోలీసులు
స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ పరిశీలించడానికి వెళ్లుతున్న టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు అరెస్టు చేశారు. మార్గమధ్యంలోనే ఆయనను పోలీసులు అడ్డుకోవడంతో టీడీపీ శ్రేణులు నిరసించాయి. చివరకు ధూళిపాళ్లను పొన్నూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు.

అమరావతి: టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ పరిశీలనకు వెళ్లుతుండగా పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం ఉదయమే ఆయన ప్రయాణం ప్రారంభించగా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. పోలీసుల తీరును టీడీపీ కార్యకర్తలు వ్యతిరేకించారు. పోలీసుల వాహనాన్ని కూడా అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. చివరకు పోలీసులు ధూళిపాళ్ల నరేంద్రను పొన్నూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు పొన్నూరు పోలీసు స్టేషన్ చేరుకుంటున్నారు.
ఏపీ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. ఆయన అరెస్టును టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. నిరసనలు చేస్తున్నారు. చంద్రబాబు కోసం మాజీ మంత్రి పరిటాల సునీత ఆమరణ దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. అయితే, పోలీసులు ఆమె దీక్షను భగ్నం చేశారు.
ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టుకు ముందు పొన్నూరు మండలం చింతలపూడిలో టీడీపీ కార్యకర్తలతో మాట్లాడారు. ప్రభుత్వం కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నదని, చంద్రబాబును అందులో భాగంగానే అరెస్టు చేసిందని ఆరోపణలు చేశారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి చంద్రబాబును కేసులో ఇరికించారని అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ కింద లక్షలాది విద్యార్థులు శిక్షణ పొందారని తెలిపారు.