నారాలోకేష్ యువగళం పాదయాత్ర వందరోజులు పూర్తి చేసుకున్న సందర్బంగా చంద్రబాబు నాయుడు అభినందిస్తూ ఓ ట్వీట్ చేశారు. 

అమరావతి : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఈ రోజుతో వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా టిడిపి అధినేత చంద్రబాబునాయుడు నారా లోకేష్ కి శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు. ‘ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి.. ఆ సమస్యల పరిష్కారానికి మార్గాలు కనుగొనేందుకు పాదయాత్ర అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రజలకు చేరువయ్యేందుకు ఇది మరింతగా దోహదపడుతుంది. ఇంకా చాలా మైళ్ళు ప్రయాణించాల్సి ఉంది’ అని చంద్రబాబు నాయుడు కొడుకుని ఉద్దేశించి ట్విటర్లో పేర్కొన్నారు.

పాదయాత్ర సమయంలో.. విద్యార్థులు, యువతతో కలిసి లోకేష్ దిగిన ఫోటోను కూడా చంద్రబాబు నాయుడు ఈ ట్వీట్ తో పాటు పోస్ట్ చేశారు. అంతకుముందు.. లోకేష్ పాదయాత్రలో ఆయన తల్లి నారా భువనేశ్వరి తో పాటు నందమూరి, నారా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర నంద్యాల జిల్లా శ్రీశైలంలో కొనసాగుతుంది. ఇప్పటివరకు లోకేష్ 1200 కిలోమీటర్ల మేర పాదయాత్ర పూర్తి చేశారు. మోతుకూరులో తన పాదయాత్ర వంద రోజులు చేరుకున్న సందర్భంగా ఓ పైలాన్ కూడా ఆవిష్కరించారు. 

100వ రోజుకు చేరిన నారా లోకేష్ యువగళం.. పాదయాత్రలో పాల్గొన్న నారా, నందమూరి కుటుంబ సభ్యులు..

పాదయాత్ర వందవ రోజు చేరుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని టిడిపి నేతలు 100 మొక్కలు నాటారు. నారా లోకేష్ కూడా ట్విట్టర్లో ఈ సందర్భంగా ఓ పోస్ట్ చేశారు.. ‘అడ్డంకుల్ని లెక్కచేయలేదు.. ఎండలకి ఆగలేదు.. వాన పడితే చెదరలేదు.. ప్రజల కోసం నేను.. నా కోసం ప్రజలు యువగళాన్ని, పాదయాత్రని ముందుండి నడిపిస్తున్నారు.. యువగళం పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా యువగళం వాలంటీర్లు, ప్రజలు, తెలుగుదేశం కుటుంబ సభ్యులు, కమిటీలు, అభిమానులకు హృదయపూర్వకంగా నా నమస్కారాలు.. అంటూ ట్వీట్ చేశారు.