తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. లోకేష్ చేపట్టిన పాదయాత్ర నేటితో 100వ రోజుకు చేరుకుంది.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. లోకేష్ చేపట్టిన పాదయాత్ర నేటితో 100వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర నంద్యాల జిల్లా శ్రీశైలంలో కొనసాగుతుంది. ఇప్పటివరకు లోకేష్ 1,200 కి.మీ మేర పాదయాత్ర పూర్తిచేశారు. అయితే తాను పాదయాత్ర 100 రోజులకు చేరుకున్న సందర్బంగా మోతుకూరులో పైలాన్ ఆవిష్కరించారు. మరోవైపు ఈరోజు లోకేష్ పాదయాత్రలో ఆయన తల్లి నారా భువనేశ్వరితో పాటు నందమూరి, నారా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అలాగే లోకేష్ సన్నిహితులు కూడా పలువురు పాదయాత్రలో కలిసి నడిచారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు 100 మొక్కలు నాటారు.
నారా లోకేష్ పాదయాత్ర 100వ రోజుకు చేరుకోవడంతో ఆయన తండ్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలయజేశారు. ‘‘యువగళం 100 రోజులు పూర్తి చేసుకున్నందుకు నారా లోకేష్ గారికి నా శుభాకాంక్షలు. లోకేష్ రోడ్డుపై గడిపిన సమయం ప్రజల నిజమైన సమస్యలను చూడటానికి.. వారికి అతడిని ఎంతో దగ్గర చేసి ఉంటుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఇంకా చాలా మైళ్లు వెళ్లాలి…’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
మరోవైపు తన పాదయాత్ర 100వ రోజుకు చేరుకున్న సందర్భంగా లోకేష్ ట్విట్టర్‌లో ఓ పోస్టు చేశారు. ‘‘అడ్డంకుల్ని లెక్క చేయలేదు. ఎండలకి ఆగిపోలేదు. వాన పడితే చెదిరిపోలేదు. ప్రజల కోసం నేను..నా కోసం ప్రజలు యువగళం పాదయాత్రని ముందుండి నడిపిస్తున్నారు. యువగళం పాదయాత్ర వందరోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలు, యువగళం వలంటీర్లు, కమిటీలు, తెలుగుదేశం కుటుంబసభ్యులు, అభిమానులకు హృదయపూర్వక నమస్కారాలు. పాదయాత్ర ప్రజల యాత్ర అయింది. యువగళం జనగళమైంది. యువగళం పాదయాత్రని విధ్వంసక, ఆటవిక సర్కారుపై ప్రజాదండయాత్రని చేసిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’’ అని లోకేష్ పేర్కొన్నారు. ఇక, నారా లోకేష్ పాదయాత్ర జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే.
