ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటై నేటికి ఏడాది. ఈ సంద‌ర్భంగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఎక్స్ వేదిక‌గా ఆస‌క్తిక ట్వీట్ చేశారు. ట్వీట్‌లో చంద్రబాబు పేర్కొన్న అంశాలు ఏంటంటే.?

ప్రజాతీర్పుతో చరిత్ర సృష్టించిన జూన్ 4

ఆంధ్రప్రదేశ్‌లో 2024 జూన్ 4న వెలువడిన ప్రజా తీర్పు రాష్ట్ర రాజకీయాల్లో చరిత్రాత్మక మలుపు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గత ఏడాది ఇదే రోజున ప్రజలు చేసిన తీర్పుతో అణచివేత పాలనకు ముగింపు పలికామని తెలిపారు. ఓటు హక్కును ఉద్యమంగా మార్చి ప్రజాస్వామ్యాన్ని తిరిగి స్థాపించారని అభిప్రాయపడ్డారు.

ప్రజా గెలుపుతో ప్రజాస్వామ్యం తిరిగి సాధించాం

"అధికారాన్ని దుర్వినియోగం చేసిన పాలకులను ప్రజలు తిప్పికొట్టారు. ప్రజల శాంతి, స్వేచ్ఛ కోసం వాళ్లు తపించారు. ఇది ఒక ప్రజావిప్లవమే," అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రజలే రాష్ట్ర పునర్నిర్మాణానికి బీజం వేసిన వారిగా పేర్కొంటూ, ప్రజల సంకల్పానికి సెల్యూట్ చేశారు.

సంక్షేమం, అభివృద్ధికి పునాదులు వేశాం

గత ఏడాది నుంచి ప్రభుత్వం ప్రతి రోజు ప్రజల ఆశలను నెరవేర్చే దిశగా పనిచేస్తోందని సీఎం చెప్పారు. సంక్షేమ పథకాలతోపాటు అభివృద్ధి ప్రాజెక్టులను అమలు చేస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. పాలన గాడిలో పడిందని, రాష్ట్ర దిశ పూర్తిగా మారిందని స్పష్టం చేశారు.

కూటమి విజయానికి కారకులైన కార్యకర్తలకు అభినందనలు

తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తల పోరాటంతోనే ఈ గెలుపు సాధ్యమైందని సీఎం చంద్రబాబు అన్నారు. విధ్వంస విధానాలను ఎదిరించిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పసుపు సైనికుల పోరాటం, జనసేన కార్యకర్తల ఉద్యమం, కమలనాథుల మద్దతు అన్నీ కూటమి విజయానికి బలమైన పునాది వేశాయ‌ని కొనియాడారు.

Scroll to load tweet…

ఇది మా హామీ

"ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యతను ఎంతో గౌరవంగా తీసుకుంటున్నాం. రాబోయే నాలుగేళ్లలో మరిన్ని అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలతో ముందుకు వెళ్తాం. ఇది మా హామీ," అని నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్ర పునర్నిర్మాణ యాత్రను ప్రజల మద్దతుతో విజయవంతం చేస్తామని చంద్ర‌బాబు రాసుకొచ్చారు.