ప్రకాశం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొత్తపేరు పెట్టారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కోడికత్తిపార్టీ అంటూ అభివర్ణించారు. ప్రకాశం జిల్లాలో రెండోరోజు పర్యటిస్తున్న చంద్రబాబు కోడి కత్తి తమను ఏం చేయలేదన్నారు. కోడి కత్తిని ప్రధాని మోదీ కత్తిగా వినియోగించుకోవాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. 

జగన్ పై దాడి విషయంలో ఏమి జరక్కుండానే గవర్నర్ నరసింహన్, బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, జీవీయల్ నరసింహరావు డీజీపీ ఠాగూర్‌తో ఏవేవో మాట్లాడుతారంటూ మండిపడ్డారు. తెలంగాణలో మహాకూటమి పెడితే అక్కడి నాయకుడితో పాటు మోదీకి వణుకు పుట్టిందన్నారు. 

ఏపీలో ప్రధాని మోదీ కోడి కత్తి పార్టీతో జత కట్టాలని చూస్తున్నారని తెలిపారు. కోడి కత్తి విషయంలో అనవసర రాద్ధాంతం చేసి వైసీపీ అభాసుపాలైందన్నారు. కోడి కత్తి పార్టీని ప్రజలెవ్వరూ నమ్మొద్దని చంద్రబాబు సూచించారు. 
 
దేశ భవిష్యత్తు బాగుండాలంటే వీరోచితంగా ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. దేశం కోసం అవసరమైనప్పుడు ఎవరితో అయినా కలవాలని తెలిపారు. రాజకీయాల్లో వ్యక్తిగత ప్రయోజనాల కన్నా దేశ ప్రయోజనాలే తనకు ముఖ్యమన్నారు. 

రాష్ట్రాన్ని మోదీ తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. వారి మోసాలను గుర్తించి ప్రశ్నించినందుకే టీడీపీ నేతలపై దాడులు చేస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. ఎన్ని దాడులు చేసినా, భయపెట్టాలని చూసినా తాను భయపడేది లేదని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు.