ఆంధ్రప్రదేశ్ లో పుంపు సెట్లకు మోటార్లు బిగించాలన్న జగన్  మోహన్ రెడ్డి సర్కారు నిర్ణయం తీవ్ర దుమారాన్ని లేపుతుంది. ఈ విషయాన్నీ ఇప్పటికే రైతు సంఘాలు వ్యతిరేకిస్తుండగా, తాజాగా టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఈ విషయం పై ఫైర్ అయ్యారు. 

ఉచిత విద్యుత్ అనేది రైతులు పోరాడి సాధించుకున్న హక్కు అని దానిని ఇప్పుడు నగదు బదిలీ కిందకు మారిస్తే... రైతుల మెడలకు అది ఉరితాడే అవుతుందని చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. 

విద్యుత్ సంస్కరణల పేరుతో.... రైతుల గింతు కోయొద్దని, అప్పులు చేయడం కోసం రైతుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని చంద్రబాబు హెచ్చరించారు. అప్పు తెచ్చుకోవడమే ప్రభుత్వానికి పరమావధిగా మారిందని చంద్రబాబు దుబయ్యబట్టారు. 

ప్రభుత్వ నిర్ణయాలు రైతులపాలిట గుదిబండగా మారాయని, మీటర్లు పెడితే... మెత్త ప్రాంత రైతులకు, ముఖ్యంగా రాయలసీమ ప్రాంత రైతులకు తీవ్ర నష్టం  జరుగుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్ చేతకాని విధానాలతో... ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట దిగజారిపోయిందని చంద్రబాబు వాపోయారు. 

అప్పులు చేయడమే పరమావధిగా 18 లక్షల రైతుల జీవితాలను ప్రభుత్వం పణంగా పెట్టిందని చంద్రబాబు దుయ్యబట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుండి సంవత్సర కాలంలోనే రెండు సార్లు విద్యుత్ చార్జీలను పెంచేశారని ఆయన దుయ్యబట్టారు. 

వైసీపీ నయవంచన రోజుకొకటి బయటపడుతుందని, ఎటుచూసినా అవినీతి, అసమర్థత మాత్రమే దర్శనమిస్తున్నాయని చంద్రబాబు దుయ్యబట్టారు. డిస్కం లను ప్రైవేటీకరించడానికి ఇదొక ఎత్తు అని చంద్రబాబు నాయుడు అనుమానం వ్యక్తం చేసారు. 

ఎన్నికలకు ముందు జగన్ సర్కార్ చెప్పిందేమిటి, ఇప్పుడు చేస్తుందేమిటి అని చంద్రబాబు నిలదీశారు. టీడీపీ హయాంలో నిరంతరం విద్యుత్ సరఫరా చేశామని, అయిదు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా విద్యుత్ రేట్లు పెంచలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. 

రైతులకు జగన్ సర్కార్ అన్యాయం చేస్తుందని అమరావతి రైతుల విషయంలో నిరూపితమైందని, ఇప్పుడు మిగిలిన రైతుల విషయంలో కూడా మోసం చేయరని గ్యారంటీ ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రం ఏమవుతుందో అని భయమేస్తుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

రాష్ట్రం తమ పాలనలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉండేదని ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి హయాంలో అడ్రస్ లేకుండా పోయిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గంటకు 9 కోట్ల రూపాయల అప్పు చేస్తూ జగన్ రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. 

విద్యుత్ రంగంపై చంద్రబాబు మాట్లాడటం ఏమిటని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారని, కానీ చరిత్ర తెలుసుకోవాలని.... విద్యుత్ సంస్కరణలను తీసుకొచ్చింది టీడీపీయేననే విషయాన్ని ఇక్కడ అందరూ గుర్తు తెచ్చుకోవాలని, విద్యుత్ రంగం మీద మాట్లాడే పూర్తి హక్కు టీడీపీకి ఉందని చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 

అమరావతి రైతులు హక్కుల కోసం పోరాడుతున్నారని, అలానే అందరూ రైతులు ఉచిత విద్యుత్ హక్కుల కోసం పోరాడాల్సిందేనని అన్నారు. అందరూ రైతులు సంఘటితం కావాలని... ఎఫ్ఆర్బీఎం పరిమిఠీ పెంచుకోవడం కోసం ప్రభుత్వం వేస్తున్న కుప్పిగంతులు ఎదుర్కోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.