తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పుష్ప చిత్రంలో తన  ఫొటో పెట్టినందుకు వైసీపీ వాళ్లు ఏడుస్తున్నారని అన్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పుష్ప చిత్రంలో నటనకు గాను అల్లు అర్జున జాతీయ ఉత్తమ నటుడు అవార్డు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మీడియా చిట్‌చాట్‌లో చంద్రబాబు మాట్లాడుతూ.. పుష్ప చిత్రంలో తన ఫొటో పెట్టినందుకు వైసీపీ వాళ్లు ఏడుస్తున్నారని అన్నారు. ఓ ప్రశ్నకు చంద్రబాబు సమాధానమిస్తూ.. ‘‘పుష్ప చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో బ్యాగ్రౌండ్‌లో నా ఫొటో ఉంది. ఆ సినిమా చూపించిన కాలంలో నేను సీఎంగా ఉన్నాననో.. లేదంటే ఎర్రచందనం స్మగ్లర్లను నేను చేశాననో చిత్ర యూనిట్ నా ఫొటో పెట్టి ఉండొచ్చు. దానికే వైసీపీ వాళ్లు ఏడుస్తున్నారు’’ అని పేర్కొన్నారు. 

సుకుమార్ తెరకెక్కించిన పుష్ప చిత్రం కథాంశం ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టూ తిరుగుతుంటుంది. పుష్ప పార్ట్-1 మంచి విజయాన్ని సొంతం చేసుకోగా.. పార్ట్-2 షూటింగ్ కూడా జరుగుతుంది. అయితే పుష్ప చిత్రంలో ఓ సందర్భంలో పోలీసు స్టేషన్ గోడపై చంద్రబాబు ఫొటో కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు పుష్ప చిత్రం విడుదలైన సమయంలో సోషల్ మీడియాలో వైరల్‌గా కూడా మారాయి. 

ఇక, 69వ జాతీయ సినీ అవార్డుల్లో.. పుష్ప చిత్రంలో నటనకు గాను అల్లు అర్జున ఉత్తమ నటుడు అవార్డు వరించింది. ఇక, ఈ సందర్భంగా చంద్రబాబు కూడా అల్లు అర్జున్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ చలన చిత్ర అవార్డుల్లో అనేక అవార్డులను సాధించి తెలుగు చలన చిత్ర రంగానికి విశిష్ట గుర్తింపును తెచ్చిన విజేతలందరికీ శుభాభినందనలు. ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్న అల్లు అర్జున్‌కు శుభాకాంక్షలు. అలాగే వివిధ విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకున్న 'ఆర్ఆర్ఆర్', 'ఉప్పెన', 'కొండపొలం' చిత్రాల దర్శకనిర్మాతలకు, సాంకేతిక నిపుణులకు, ఉత్తమ విమర్శకుడుగా ఎంపికైన పురుషోత్తమాచార్యులుకు అభినందనలు’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.