అమరావతి: కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఇరు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. వరద నీటితో ఆంధ్ర ప్రదేశ్ లో నదులన్నీ ఉగ్రరూపం దాల్చి ప్రమాదకర రీతిలో ప్రవహిస్తున్నాయి. ఇక నీటిపారుదల ప్రాజెక్టులు, చెరువులు నిండుకుండల్లా మారాయి. దీంతో రాష్ట్రంలోని లోతట్టు ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాలు నీటమునిగాయి. 

వరదనీటితో కృష్ణా నదిలో కూడా ప్రవాహం భారీగా పెరగడంతో టిడిపి అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసముంటున్న ఇల్లు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ప్రకాశం బ్యారేజీలోకి 7.44 లక్షల క్యూసెక్కుల ప్రవాహం రావడంతో గురువారం ఎగువ ప్రాంతంలో కరకట్టపై నిర్మించిన గెస్ట్‌హౌస్‌ల చుట్టూ వరదనీరు చేరింది. ఇలా చంద్రబాబు నివాసం చుట్టూ కూడా వరద నీరు చేరింది. ఈ నివాసం చుట్టూ రహదారుల్లో తప్ప నాలుగువైపులా నీళ్లు చుట్టుముట్టాయి. హెలీప్యాడ్‌ సగం వరకు మునిగిపోయింది. 

గురువారం రాత్రి మరింత వరద వచ్చే సమాచారం అందటంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కరకట్ట వెంట వున్న నిర్మాణాల్లో ఉన్నవారిని ఖాళీచేయాలని అధికారులు ఆదేశించారు. ఇలా చంద్రబాబు కుటుంబంతో కలిసి నివాసముంటున్న ఇంటికి కూడా అధికారులు నోటీసులు అందించారు. 

గతేడాది కూడా ఇలాగే కురిసిన భారీ వర్షాలతో కృష్ణా నదికి వరద పోటెత్తడంతో కరకట్టపై గల చంద్రబాబు నివాసం వద్దకు వరద నీరు చేరుకుంది. ఆయన  నివాసంలోని గార్డెన్, బయట ఉన్న హెలి ప్యాడ్  కూడా పూర్తిగా వరద నీటితో మునిగిపోయింది. ఇంటి చుట్టుపక్కల ఉన్న గులాబి తోట, అరటి తోటలు కూడా పూర్తిగా జలమయమయ్యాయి. రివర్ ఫ్రంట్ వ్యూభవనం, వాక్ వే కూడా నీట మునిగిపోయాయి. దీంతో అప్పట్లో ఇంటిలోనికి వరద నీరు చేరుకుండా 10ట్రక్కుల చిప్స్, ఇసుక బస్తాలను వేశారు.    

ఇదిలా ఉండగా ప్రస్తుత వరదల కారణంగా ఏపీలో ఇప్పటి వరకు పది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, వరదలపై ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌ రెడ్డి ఉన్న‌త‌స్థాయి స‌మావేశం ఏర్పాటు చేసి ప‌రిస్థితిని స‌మీక్షించారు. జిల్లా కలెక్ట‌ర్‌లు, ఇత‌ర‌ అధికారులు, పోలీసులు అనుక్ష‌ణం అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సీఎం సూచించారు. 

గత మూడు రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల కారణంగా ఇప్ప‌టివ‌ర‌కు 10 మంది మృతిచెందిన‌ట్లు ఏపీ సీఎం కార్యాల‌యం వెల్ల‌డించింది. మృతులంద‌రికీ ఎక్స్‌గ్రేషియా చెల్లించాల‌ని సీఎం జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించార‌ని ఏపీ సీఎంవో తెలిపింది.