Asianet News TeluguAsianet News Telugu

ఏం చేసినా ఏపీ ప్రయోజనాల కోసమే: ఎన్డీఏలో టీడీపీ చేరబోతుందనే ప్రచారంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

తెలుగుదేశం పార్టీ తిరిగి ఎన్డీఏలో చేరుతుందా..? అనే అంశంల ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే నేడు మీడియాతో చిట్‌ చాట్ నిర్వహించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ అంశంపై స్పందించారు.

Chandrababu Naidu Response On TDP likely to Rejoin NDA Rumours
Author
First Published Sep 1, 2022, 5:01 PM IST

తెలుగుదేశం పార్టీ తిరిగి ఎన్డీఏలో చేరుతుందా అనే అంశంల ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇటీవల రిపబ్లిక్ చానల్‌లో వెలువడిన కథనం తర్వాత ఆ చర్చ మరింత విస్తృతమైంది. అయితే నేడు మీడియాతో చిట్‌ చాట్ నిర్వహించిన చంద్రబాబు నాయుడు ఈ అంశంపై స్పందించారు. అలా ప్రచారం చేస్తున్నవారే.. దానికి సమాధానం చెప్పాలని అన్నారు. ఎన్డీఏలో చేరిక అంశంపై ఇప్పుడే స్పందించనని చెప్పారు. ఆనాడు ఏపీ ప్రయోజనాల కోసమే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామని తెలిపారు. 

రాష్ట్ర విభజన వల్ల ఏపీకి జరిగిన నష్టం కంటే.. సీఎం జగన్ వల్ల రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరుగుతుందని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు పాలనపై దృష్టి పెట్టడంతోనే పార్టీ రెండు సార్లు నష్టపోయిందని అన్నారు. ఏపీకి మంచి పేరు తీసుకురావాలనే తపనతో వ్యక్తిగతంగా ఎంతో నష్టపోయామని చెప్పారు. సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది టీడీపీనేనని అన్నారు. రాష్ట్ర విభజన వల్ల ప్రజల్లో భయాందోళనలు ఉన్నప్పటికీ.. తెలంగాణ కంటే మెరుగ్గా సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పారు. 

Also Read: కేసీఆర్‌పై బీజేపీ ఫైట్: ఎన్డీఏలోకి మళ్లీ చంద్రబాబు..?

ఏపీ ప్రయోజనాల కోణంలోనే కేంద్ర రాజకీయాలను చూస్తామని చెప్పారు. ఏం చేసినా రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని అన్నారు. వైసీపీ నేతలు కూడా ఇప్పుడు కంటినిండా నిద్రపోవడం లేదని చంద్రబాబు అన్నారు. వ్యవస్థలు నాశనమయ్యాక ఎవ్వరూ ఏం చేయలేని పరిస్థితి వచ్చేసిందని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వస్తే రెట్టింపు సంక్షేమం అందిస్తామని చెప్పారు. 

ఇక, ఇటీవల రిపబ్లిక్ టీవీ కథనంలో.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో త్వరలో కొత్త కూటమి ఏర్పడబోతుందని, ఎన్డీయేలోకి టీడీపీ తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలు తెలిపినట్టుగా ఆ చానల్ పేర్కొంది.‘‘ఎన్డీయేలోని ప్రధాన పార్టీగా ఉన్న బీజేపీ, టీడీపీలు.. తెలుగు రాష్ట్రాల పొత్తు కోసం చర్చలు జరుపుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఇటీవల భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల్లోనూ టీడీపీకి మంచి ఓటు బ్యాంకు ఉండడంతో టీడీపీతో పొత్తుపై బీజేపీ యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం’’ అని ఆ చానల్ తెలిపింది. ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవం రోజున త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన చంద్రబాబు జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. మోదీపై ప్రశంసల జల్లు కురిపించారని గుర్తుచేసింది. 

అయితే టీడీపీ తిరిగి ఎన్డీయేలోకి వస్తుందనే ప్రచారాన్ని ఏపీ, తెలంగాణకు చెందిన బీజేపీ నేతలు ఖండిస్తున్నారు. అలాంటిదేమి జరగబోదని చెబుతున్నారు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ మాట్లాడుతే.. తెలంగాణలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని చెప్పారు. ఏపీలో బీజేపీకి, జనసేతో పొత్తు ఉందని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios