Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్‌పై బీజేపీ ఫైట్: ఎన్డీఏలోకి మళ్లీ చంద్రబాబు..?

తెలుగుదేశం పార్టీ తిరిగి ఎన్టీయే కూటమిలో చేరుతుందా..? అనే చర్చ గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విపరీతంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల చంద్రబాబు ఢిల్లీ టూర్ తర్వాత ఈ చర్చ మరింత విస్తృతంగా సాగుతుంది.

Chandrababu Naidu may rejoin NDA buzz in National media
Author
First Published Aug 31, 2022, 12:29 PM IST

తెలుగుదేశం పార్టీ తిరిగి ఎన్టీయే కూటమిలో చేరుతుందా..? అనే చర్చ గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విపరీతంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు తెరవెనక ప్రయత్నాలు జరుగుతున్నాయని కొందరంటే.. అలాంటిదేమి ఉండకపోవచ్చని మరికొందరు కొట్టిపరేస్తున్నారు. అయితే ఇటీవల చంద్రబాబు ఢిల్లీ టూర్ తర్వాత ఈ వార్తలు మరింతగా ప్రచారంలోకి వచ్చాయి. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో త్వరలో కొత్త కూటమి ఏర్పడబోతుందని.. ఎన్డీయేలో టీడీపీ తిరిగి రాబోతుందని ఇంగ్లీష్ న్యూస్ చానల్ రిపబ్లిక్ రిపోర్ట్ చేసింది. విశ్వసనీయ వర్గాలు తెలిపినట్టుగా ఆ చానల్ పేర్కొంది. దీంతో ప్రస్తుతం ఈ అంశం తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 

రిపబ్లిక్ చానల్ ఆ కథనంలో మరిన్ని ఆసక్తికరమైన అంశాలను పేర్కొంది. ‘‘ఎన్డీయేలోని ప్రధాన పార్టీగా ఉన్న బీజేపీ, టీడీపీలు.. తెలుగు రాష్ట్రాల పొత్తు కోసం చర్చలు జరుపుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఇటీవల భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల్లోనూ టీడీపీకి మంచి ఓటు బ్యాంకు ఉండడంతో టీడీపీతో పొత్తుపై బీజేపీ యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం’’ అని ఆ చానల్ తెలిపింది. ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవం రోజున త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన చంద్రబాబు జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. మోదీపై ప్రశంసల జల్లు కురిపించారని గుర్తుచేసింది. 

Chandrababu Naidu may rejoin NDA buzz in National media

‘‘2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ, బీజేపీ‌లు విడిపోయాయి.బీజేపీ హామీలను తుంగలో తొక్కిందని టీడీపీ మోదీ కేబినెట్‌ నుంచి వైదొలగింది. ఇటు బీజేపీ కూడా ఆంధ్రలో చంద్రబాబు మంత్రివర్గంలో నుంచి బీజేపీ బయటకు వచ్చింది. ఎన్డీయే కూటమి నుంచి టీడీపీ విడిపోవడాన్ని రాజకీయ అవకాశవాదం అని బీజేపీ అభివర్ణించింది. రెండు పార్టీల మధ్య పొత్తు విచ్ఛిన్నం కావడానికి ప్రత్యేక హోదా ప్రధాన కారణం. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల ఒత్తిడి కారణంగా హోదా డిమాండ్‌పై చంద్రబాబు పట్టుబట్టారు. కేంద్రం దానిని పట్టించుకోలేదు. మరోవైపు అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. కేంద్రం వద్ద ఫ్రీ-ఫ్లోటింగ్ నిధులు లేవు. భారతదేశంలోని ప్రతి రాష్ట్రానికి ఒకే విధంగా కేంద్ర నిధులపై హక్కు ఉంది. నేను ఏపీ పట్ల సానుభూతితో ఉన్నాను. విభజన కారణంగా అది నష్టపోయిందని తెలుసని కామెంట్ చేయడం పరిస్థితిని మరింత దిగజార్చింది’’ అని రిపబ్లిక్ చానల్ తన కథనంలో పేర్కొంది.  

ఇదిలా ఉంటే.. తెలంగాణలో కేసీఆర్ బీజేపీ‌పై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీపై పోరాడేందుకు విపక్షాల మద్దతు కూడగట్టేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు బీజేపీ మాత్రం తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతుంది. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీతో పొత్తు బీజేపీ పెట్టుకోవాలని భావిస్తుందనే సోషల్ మీడియాలో  ప్రచారం సాగుతుంది. ‘‘టీడీపీతో పొత్తు పెట్టుకుంటే.. ఆ పార్టీకి తెలంగాణలో ఉన్న కొద్దిపాటి ఓటు బ్యాంక్, హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో సెటిలర్లలో టీడీపీ మద్దతుదారులను తమవైపు తిప్పుకొవచ్చని బీజేపీ చూస్తుంది. అలాగే ఏపీలో లోక్‌సభ స్థానాలకు బీజేపీ అభ్యర్థులకు కేటాయించేలా టీడీపీతో పొత్తుకు బీజేపీ ఆలోచన చేస్తుంది. గత ఎన్నికల్లో ఓటమితో ఘోర పరాభం చవిచూసిన టీడీపీ.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేజిక్కుంచుకోవాలని చూస్తుంది. ఇందుకోసం బీజేపీతో జత కట్టేందుకు తెర వెనక ప్రయత్నాలు చేస్తుంది’’ అనేది సోషల్ మీడియాతో సాగుతున్న ప్రచారం సారాంశం. ఇక, ఇలాంటి సమయంలో రిపబ్లిక్ చానల్ నుంచి ఎన్డీయే‌లో తెలుగు దేశం పార్టీ మళ్లీ చేరబోతుందనే కథనం వెలువడటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 

Follow Us:
Download App:
  • android
  • ios