ఆంధ్రప్రదేశ్ గత కొద్ది రోజులుగా టీడీపీ, బీజేపీల మధ్య మళ్లీ పొత్తు చిగురిస్తుందా..? అనే అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజా పరిణామాలను పరిశీలిస్తే.. ఆ దిశగా ప్రయత్నాలు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ గత కొద్ది రోజులుగా టీడీపీ, బీజేపీల మధ్య మళ్లీ పొత్తు చిగురిస్తుందా..? అనే అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజా పరిణామాలను పరిశీలిస్తే.. ఆ దిశగా ప్రయత్నాలు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం ఉంది. అమిత్ షా నేడు తెలంగాణ పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. మధ్యాహ్నం బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న అమిత్ షా.. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మునుగోడులో బీజేపీ బహిరంగ సభకు హాజరవుతారు. అనంతరం రోడ్డు మార్గాన శంషాబాద్ నోవాటెల్ హోటల్‌కు చేరుకుని తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలతో సమావేశం అవుతారు. అనంతరం ఢిల్లీ బయలుదేరి వెళతారు.
అయితే మునుగోడు-శంషాబాద్ మార్గమధ్యలో అమిత్ షా.. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆగనున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావుతో సమావేశం కానున్నారు. అక్కడ అమిత్ షాను చంద్రబాబు కలిసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు ఆంగ్ల మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. రామోజీరావు సమక్షంలో చంద్రబాబు నాయుడు.. అమిత్ షాతో భేటీ జరగనున్నట్టుగా తెలుస్తోంది. దాదాపు 45 నిమిషాల పాటు అమిత్ షా రామోజీ ఫిల్మ్ సిటీలో ఉండనున్నారు. టీడీపీ, బీజేపీల మధ్య పొత్తును పునరుద్ధరించేందుకు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత సుజనా చౌదరి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం.
గతంలో చాలా కాలం పాటు బీజేపీ, టీడీపీలు మిత్రపక్షాలుగా ఉన్న సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కలిసి ఎన్నికలకు వెళ్లాయి. అయితే 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు మందే చంద్రబాబు నాయుడు.. బీజేపీకి దూరమయ్యారు. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే కొన్ని నెలలుగా టీడీపీ, బీజేపీల పొత్తు పునరుద్దరణకు తెరవెనక ప్రయత్నాలు సాగుతున్నట్టుగా ప్రచారం సాగుతుంది. ఇటీవల ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు, తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి జగదీప్ ధన్‌కర్‌కు టీడీపీ మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో టీడీపీ-బీజేపీ పొత్తు పునరుద్దరణకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారానికి బలం చేకూరింది.
ఇక, చాలా కాలం తర్వాత ఇటీవల ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు నాయుడు.. నూతన రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ తర్వాత ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జాతీయ కమిటీ సమావేశంలో పలురంగాలకు చెందిన ప్రముఖులతో పాటు చంద్రబాబు హాజరయ్యారు. అయితే సమావేశం ముగిసిన తర్వాత చంద్రబాబు, అమిత్ షాల మధ్య స్నేహపూర్వక సంభాషణ జరిగినట్టుగా టీడీపీ వర్గాలు తెలిపాయి. దీంతో టీడీపీ-బీజేపీల పొత్తు పునరుద్దరణ అంశం ఏపీ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇక, నేడు అమిత్ షాను చంద్రబాబు నాయుడు కలిస్తే.. రెండు పార్టీల మధ్య పొత్తును పునరుద్ధరించాలని ఆయన కోరే అవకాశం ఉంది. అమిత్ షా, మోదీ.. టీడీపీతో పొత్తుకు అంగీకరిస్తే ఏపీలోని 25 లోక్‌సభ సీట్లలో ప్రధాన వాటాను బీజేపీకి ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్టుగా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈరోజు భేటీ జరిగిన పక్షంలో రానున్న ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ పొత్తుపై కొంతమేర స్పష్టత వచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.
