ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జాతీయ జెండా ఆవిష్కరించిన చంద్రబాబు పలు విషయాలను పంచుకున్నారు.
రాష్ట్ర పునర్నిర్మాణం దిశగా
ఇందిరా గాంధీ స్టేడియంలో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు, 79వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్రం తర్వాత దేశం అనేక మార్పులను చూసిందని, 2014లో జరిగిన రాష్ట్ర విభజనతో కొత్త సవాళ్లు ఎదురైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని అన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు “ప్రజలు గెలవాలి – రాష్ట్రం నిలవాలి” అనే NDA నినాదాన్ని విశ్వసించి చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని, దీనివల్ల నిశ్శబ్ద విప్లవం చోటుచేసుకుందని గుర్తు చేశారు.
సంక్షేమం – సుపరిపాలనలో రికార్డు సృష్టి
కూటమి ప్రభుత్వ పాలనలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు సాటి లేదని చంద్రబాబు తెలిపారు. సూపర్ సిక్స్ హామీలు పూర్తి స్థాయిలో అమలు చేసి ‘సూపర్ హిట్’ చేశారన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కింద 64 లక్షల మందికి ఇంటివద్దే పంపిణీ చేశామన్నారు. తల్లికి వందనంతో పేద తల్లులకు విద్యా సహాయం, రూ.10 వేల కోట్ల ఖర్చు చేశామన్నారు. అన్నదాత సుఖీభవతో రైతులకు రూ.7 వేలు ఆర్థిక సాయం, 47 లక్షల మందికి రూ.3,173 కోట్లు అందించామన్నారు. దీపం పథకంతో ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, రూ.2,684 కోట్ల ఖర్చు చేసినట్లు చెప్పుకొచ్చారు. స్త్రీ శక్తి పథకం ద్వారా స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని చంద్రబాబు అన్నారు. ఇక అన్నా క్యాంటీన్ల ద్వారా రూ.5కే భోజనం, 5.16 కోట్ల మందికి లబ్ధి చేకూరందన్నారు. బ్రాహ్మణులు, కల్లు గీత కార్మికులు, మత్స్యకారులు, చేనేత రంగాలకు చెందిన వారికి వేతనాల పెంపు, ఉచిత విద్యుత్, ప్రత్యేక సబ్సిడీలు అందిచామని చంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు.
అభివృద్ధి – మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టుల ప్రాధాన్యం
* పోలవరం ప్రాజెక్టు – 2027 డిసెంబర్ నాటికి పూర్తి. కేంద్రం రూ.12,157 కోట్లు మంజూరు.
* వెలుగొండ ప్రాజెక్టు – 2025 జూలైలో సాగునీరు అందేలా పనులు.
* గోదావరి నీటిని రాయలసీమకు – పోలవరం నుంచి బనకచర్లకు మళ్లింపు ప్రణాళిక.
* రోడ్లు – 4,000 కి.మీ సీసీ రోడ్లు, 250 కి.మీ బీటీ రోడ్లు.
* జల జీవన్ మిషన్ – 2028 నాటికి ప్రతి గడపకు తాగునీరు.
* గ్రామీణ, గిరిజన ప్రాంతాల కనెక్టివిటీ – ‘అడవితల్లి బాటలో’ ద్వారా రూ.1,000 కోట్ల రోడ్ల నిర్మాణం చేపట్టామని చంద్రబాబు తెలిపారు.
ఆర్థిక, పారిశ్రామిక, పట్టణాభివృద్ధి
* ఇన్వెస్ట్మెంట్ ఆకర్షణ – 9 స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశాల్లో 113 ప్రాజెక్టులకు రూ.5.94 లక్షల కోట్ల ఆమోదం, 5.56 లక్షల ఉద్యోగాల సృష్టి.
* నిర్మాణ రంగం – ఉచిత ఇసుక విధానం, ఇప్పటివరకు 1.5 కోట్ల మెట్రిక్ టన్నులు అందజేత.
* పట్టణాభివృద్ధి – 100 గజాల లోపు స్థలాలకు బిల్డింగ్ ప్లాన్ అవసరం లేకుండా నిర్మాణ అనుమతులు.
* ఐటీ రంగం – గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ పెట్టుబడులకు ఆసక్తి.
* డిజిటల్ పరిపాలన – ‘మన మిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 700 పౌర సేవలు.

సైనిక శక్తిని ప్రపంచానికి చాటాం
భారత ఆర్థిక శక్తి, రక్షణ సామర్థ్యాలను చంద్రబాబు పొగిడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ త్వరలోనే ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా సైనిక శక్తిని ప్రపంచానికి చాటామని, త్రివిధ దళాలకు గౌరవం ఇవ్వాలని పిలుపునిచ్చారు. “మనది డెడ్ ఎకానమీ కాదు… గుడ్ ఎకానమీ” అని స్పష్టం చేశారు.
