కడప: కడప జిల్లాలో ఏర్పాటు చెయ్యబోతున్న స్టీల్ ప్లాంట్ కు రాయలసీమ స్టీల్ ప్లాంట్ గా నామకరణం చేసినట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నూటికి నూరుశాతం కడప స్టీల్ ప్లాంట్ ని త్వరలోనే పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

మైలవరం మండలం, కంబాలదిన్నెవద్ద కడప ఉక్కు ఫ్యాక్టరీకి శంఖుస్థాపన చేసిన చంద్రబాబు ఆ తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. కేంద్రం మోసం చేస్తే  బాధతో కసితో, ఆవేదనతో, మోసం చేసిన వారికి గుణపాఠం చెప్పేలా కడప స్టీల్ ప్లాంట్ ని నిర్మిస్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. 

కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం పేపర్ మీద పెట్టింది కాదని తాము ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న ప్లాంట్ అని చెప్పారు. పునర్విభజన చట్టంలోని హామీల్లో ఒకటైన కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి కేంద్రం సహకరించలేదని ఆరోపించారు. 

కడప జిల్లాలో ఉక్కు కర్మాగారానికి కేంద్రప్రభుత్వం మెుదటి నుంచి మోకాలడ్డుతుందని ఆరోపించారు. ఒక్క ఫ్యాక్టరీ నిర్మించడానికి 18 సార్లు కేంద్రం లేఖలు రాయడం సమంజసమా అంటూనిలదీశారు. ఫీజుబిలిటీ, అంటూ మౌళిక సదుపాయాలు ఇలా వరుసగా అనేక వివరాలు అడిగారని ప్రతీ దానికి సమాధానం చెప్పామన్నారు.

కడపలో ఉక్కు కర్మాగారానికి అన్ని మౌళిక సదుపాయాలు ఉన్నా కనీసం పట్టించుకోలేదన్నారు. కడప జిల్లాలో గండికోట ప్రాజెక్టు ద్వారా నీరు అందిస్తానని, థర్మల్ ప్లాంట్ ద్వారా విద్యుత్ అందిస్తామని, రైల్వే లైన్ ఉందని, పోర్టు కూడా ఉందని, అలాగే ఎయిర్ పోర్ట్ ఉందని వీటితోపాటు జాతీయరహదారి కూడా ఉందని కేంద్రానికి తానే స్వయంగా చెప్పినట్లు తెలిపారు. 

కడప ఉక్కుకర్మాగారంపై 18 జూన్ 2018న ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాసినట్లు తెలిపారు. ప్రధానితోపాటు రెండు సార్లు మైనింగ్ శాఖ మంత్రికి కూడా లేఖలు రాసినట్లు తెలిపారు. 

అయితే ఫీజుబిలిటీపై కేంద్రప్రభుత్వం మెకాన్ అనే సంస్థకు విచారణకు ఆదేశించిందని ఆ సంస్థ ఇంటీరియల్ రిపోర్ట్ ఇచ్చిందని చంద్రబాబు తెలిపారు. ఉక్కు కర్మాగారం వల్ల లాభదాయకమని నిర్ధారించిందని చెప్పారు. 

అయితే మెకాన్ సంస్థ నివేదిక కేంద్రానికి అందిన తర్వాత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. తమ ఎంపీలు పార్లమెంట్ లో పోరాటం చేశారని అందర్నీ కలిశారని చంద్రబాబు గుర్తు చేశారు. టీడీపీ ఎంపీలు ఆమరణ నిరాహార దీక్షలు సైతం చేశారని చెప్పుకొచ్చారు. 

తాను పది సంవత్సరాలు ఇన్సెంటివ్స్ ఇస్తానని, సంవత్సరానికి 6వందల కోట్లు వదులుకుంటామని, 100కోట్ల రూపాయిలతో కరెంట్ రాయితీ ఇస్తామని, భూముల రిజిస్ట్రేషన్ కు సంబంధించి 50 కోట్లు, నీటి కింద 100 కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తామన్నారు. 

ఏడాదికి 900 కోట్లు రూపాయలు నష్టం పోయినా కేంద్రాన్ని ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చెయ్యాలని కోరామని తెలిపారు. అయినా కేంద్రం కరుణించలేదన్నారు. పది సంవత్సరాలపాటు ఇన్ కం ట్యాక్స్ 300 కోట్లు, జీఎస్టీ 600 కోట్లు ఏడాదికి 900 కోట్లు చొప్పన పది సంవత్సరాల పాటు ఇన్సింటీవ్స్ ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. 

10 సంవత్సరాల తర్వాత ఉక్కు కర్మాగారాన్ని లాభాల బాట పట్టించే బాధ్యత తనదేనని చెప్పినా కనీసం పట్టించుకోలేదన్నారు. ఇలా ఎన్నో అవకాశాలు ఇచ్చినా కేంద్రం పట్టించుకోలేదని తెలిపారు. 

ఇక లాభం లేదనుకున్న తాను 60 రోజుల్లో ఉక్కు కర్మాగారం నిర్మాణంపై నిర్ణయం తీసుకోవాలని అల్టిమేటం జారీ చేశామని అయినా మార్పు రాలేదన దాంతో తామే నిర్మించాలని తలపెట్టినట్లు తెలిపారు.  

ప్రస్తుతం మెుదటి దశలో రూ.18వేల కోట్ల రూపాయలతో ఉక్కు కర్మాగారాన్ని నిర్మిస్తామని అలాగే 5వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. రెండో దశలో మరో రూ.15వేల కోట్లు వెచ్చించి మరింత అభివృద్ధి చేస్తామన్నారు. అదనంగా మరో 5వేలు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. మెుత్తం కడప ఉక్కు కర్మాగారం వల్ల 10వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.

బీజేపీ రాష్ట్రానికి చేసిన అన్యాయంపై తెలుగుదేశం పార్టీ పోరాటం చేసిందని చంద్రబాబు తెలిపారు. కేంద్రప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం కూడా పెట్టామని గుర్తు చేశారు. అయితే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఏనాడైనా ఉక్కు కర్మాగారం కోసం మాట్లాడాడా అని ప్రశ్నించారు. 

ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలపై తాము పోరాటం చేస్తుంటే వైఎస్ జగన్ ఆయన ఎంపీలు రాజీనామాలు చేసి పారిపోయారని చెప్పారు. పార్లమెంట్ వెళ్లకుండా పారిపోవడం కూడా ఓ కుట్రేనంటూ చెప్పుకొచ్చారు. 

వైఎస్ జగన్, బీజేపీతో కుమ్మక్కయ్యారంటూ ఆరోపించారు. లాలూచీ రాజకీయాలకు జగన్ పాల్పడ్డారని విమర్శించారు. గతంలో ఓబుళాపురం మైనింగ్ ను విదేశాలకు తరలించి రూ.30 వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. 

ఆ డబ్బుతో ఆర్ ఆర్ గ్లోబల్, రెడ్ గ్లోబల్ పేరుతో సంస్థలను స్థాపించి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు దోచుకున్నారంటూ మండిపడ్డారు. అలా దోపిడీకి పాల్పడింది సజ్జల దివాకర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలేనని చెప్పుకొచ్చారు. 

కడప జిల్లాకు ఉక్కుకర్మాగారం వస్తుంటే కరుడు గట్టిన వ్యక్తులు సైతం అభినందిస్తారని ఆనంద పడతారని కానీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అండ్ కంపెనీ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉక్కు కర్మాగారం మాటున రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుందంటూ ఆరోపించడం బాధాకరమన్నారు. 

ఈ వార్తలు కూడా చదవండి

కడప స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు