కడప: రాయలసీమ వాసుల చిరకాల స్వప్నం నెరవేరనుంది. సీమ ముఖ చిత్రాన్ని మార్చే కడప స్టీల్ ఫ్లాంట్‌కు సీఎం చంద్రబాబు గురువారం భూమి పూజ చేశారు. మైలవరం మండలం, కంబాలదిన్నెవద్ద కడప ఉక్కు ఫ్యాక్టరీకి శంఖుస్థాపన చేశారు. 

రూ.18వేల కోట్ల పెట్టుబడితో మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ స్టీల్ ప్లాంట్ ను నిర్మించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. విభజన హామీల్లో  కడప స్టీల్ ప్లాంట్ ఒకటి. అయితే కేంద్రప్రభుత్వాన్ని ఎన్నిసార్లు మెరపెట్టుకున్నా కడప స్టీల్ ప్లాంట్ పై స్పందించకపోవడంతో ప్రభుత్వమే నేరుగా రంగంలోకి దిగింది. 

ఏపీ ప్రభుత్వమే సొంతంగా స్టీల్ ఫ్లాంట్ ను నిర్మిస్తామని ఇటీవలే చంద్రబాబు నాయుడు ప్రకటించారు. చెప్పినట్లుగానే కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఏళ్ల తరబడి సీమవాసుల ఆకాంక్షగా ఉన్న ఉక్కు పరిశ్రమను చంద్రబాబు శంకుస్థాపన చెయ్యడంతో రాయలసీమ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రారంభోత్సవ వేడుకలో రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి సుజయ్ కృష్ణ రంగరావు, జిల్లా మంత్రి ఆదినారాయణ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, టీడీపీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డిలు పాల్గొన్నారు. అనంతరం వీరు పైలాన్ ఆవిష్కరించారు.