ఈ రోజు తెలంగాణ తమ్ముళ్లకు ఆయన చేసిన బోధ చూస్తే టిడిపి ఉన్నట్లుండి టిఆర్ ఎస్ కు మిత్రపక్షమయినట్లు కనిపిస్తుంది
తెలంగాణాలో ఇక టిడిపి పోరాటాలుండవు. సరిగదా, టిఆర్ ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడమే కాదు, ముఖ్యమంత్రి కెసిఆర్ ను నొప్పించే ప్రసంగాలేవీ ఉండవు. ఈ రోజు తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలంగాణ టిడిపి నేతలతో మాట్లాడుతూ రూట్ మార్చేశారు. మాట మార్చేశారు.
గతంలో టిటిడిపి నాయకులతో మాట్లాడినపుడల్లా ఆయన ప్రజాసమస్యల మీద పోరాడండని పిలుపు నిచ్చేవాడు. తాను స్వయంగా కెసిఆర్ ప్రభుత్వాన్ని విమర్శించకపోయినా, ఇతర నాయకులకు ఫుల్ స్వేచ్చనిచ్చి తెలంగాణ ప్రభుత్వాన్ని ఉతికి ఆరేయించేవాడు. ఇపుడు కథ మారింది. అరిచే రేవంత్ గొంతు కాంగ్రెెస్కు వెళ్లింది. అంతా అనుమానిస్తున్నట్లుగా టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటారా అని అనిపించేలా చంద్రబాబునాయుడు నాలుగు మెట్లు దిగినట్లే కనబడుతోంది. గురువారం చంద్రబాబు మాటలు విన్న వారికి వచ్చే ఎన్నికల్లో ‘వెలకం గ్రూప్’ పొత్తు తప్పదన్న సంకేతాలే కనిపించాయి. గురువారం చాలా మృదువుగా, అధికారి పార్టీకి ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా, మిత్రపక్షంలాగా ప్రసంగించారు. ‘మీరు ఎవరితో యుద్ధానికి పోనవసరంలేదు. ప్రజలకు సేవచేస్తూ ఉండండి. వ్యూహం గీహం ఏదైనా ఉంటే, నాకు వదలిపెట్టండి,’ అని తెలుగు తమ్ముళ్లకు అక్షరం పొల్లుపోకుండా పార్టీ లైన్ బోధించారు.
టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తెలంగాణాలో కాడిదింపేసాడనిపిస్తుంది. ప్రజలకు కార్యకర్తలు, నేతలు సేవలు చేయాలని ఇచ్చిన పిలుపు చూస్తుంటే అందరికీ అదే అనుమానం వస్తోంది. కాబట్టి టిటిడిిపి నేతలకు ఇక నుండి పూర్తి విశ్రాంతే. ఎందుకంటే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలంటే కష్టపడాలి. ప్రజలకు సేవ చేయాలంటే పడే కష్టమేముంటుంది? ఇష్టం ఉంటే చేస్తారు లేకపోతే దుకాణం బంద్ చేస్తారు. గురువారం నేతలు, కార్యకర్తలతో మాట్లాడిన చంద్రబాబు ఎక్కడ కూడా ప్రభుత్వంపై పోరాటాలు చేయాలని చెప్పలేదు.
తన సహజ శైలికి భిన్నంగా మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. రేవంత్ పార్టీ వీడిన దెబ్బ చంద్రబాబుపై స్పష్టంగా కనబడింది. ఎందుకంటే, మొన్నటి వరకూ చంద్రబాబు ఎప్పుడు మాట్లాడినా ప్రభుత్వంపైన, కెసిఆర్ పైన విరుచుకుపడేవారు. కానీ ఈరోజు మాట్లాడిన విధానం చూస్తుంటే భవిష్యత్తులో చంద్రబాబు-కెసిఆర్ పొత్తులు తప్పవేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చంద్రబాబు మాట్లాడుతూ, జనాలకు సేవ చేయండని, ప్రజల్లో మమేకం అవ్వండని, పార్టీలో బలోపేతం చేయమని, తిరుగులేని శక్తిగా మార్చమని..ఇలా ఉప్పులేని పప్పులాంటి స్పీచ్ ఇచ్చారు. చంద్రబాబు ప్రసంగాన్ని సాంతం విన్న వారికి టిడిపికి తెలంగాణా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే శక్తి లేదని, భవిష్యత్తులో అవసరం కూడా రాదేమోనన్న అనుమానాలు మొదలయ్యాయి.
