అమరావతి: కరోనా కారణంగా ఉపాధి కోల్పోతున్నవారికి  తెలంగాణ, కేరళ రాష్ట్రాల మాదిరిగా ఏపీ ప్రజలకు కూడ ప్యాకేజీని ఇవ్వాలని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. 

మంగళవారం నాడు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు మీడియాాతో మాట్లాడారు.. విదేశాల నుండి వచ్చిన వారిని ముందే క్వారంటైన్ చేస్తే బాగుండేదని ఆయన అబిప్రాయపడ్డారు. 

also read:కరోనా దెబ్బ: ఏపీలో టెన్త్ పరీక్షలు వాయిదా వేసిన సర్కార్

 

విదేశాల నుండి వచ్చిన వారిని ఏపీ రాష్ట్రంలో ఆలస్యంగా క్వారంటైన్ చేశారనన్నారు.వ్యక్తుల మధ్య సామాజిక దూరాన్ని పాటించాల్సిన అవసరం ఉందని బాబు చెప్పారు.

డిజిటల్ సోషలైజేషన్ కు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా కారణంగా కొన్ని రంగాల ప్రజలు ఉపాధి కోల్పోయే అవకాశం ఉందన్నారు.లాక్‌డౌన్ ను అందరూ తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా కారణంగా ఆర్ధిక పరిస్థితి కూడ దెబ్బతినే ప్రమాదం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

కరోనా కారణంగా వ్యవసాయం, పౌల్ట్రి పరిశ్రమ తీవ్రంగా దెబ్బతిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  ఇంటింటికి నిత్యావసర సరుకులను సరఫరా చేయాలని బాబు ప్రభుత్వాలను కోరారు.శానిటైజర్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆయన సూచించారు. 

హుదూద్ తుఫాన్ సమయంలో తాము అధికారంలో ఉన్న సమయంలో నిత్యావసర సరుకులతో పాటు రూ. 4 వేల ప్యాకేజీని ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం కరోనా కారణంగా ఏపీలో పేదలకు ప్యాకేజీని ఇవ్వాల్సిందిగా ఆయన ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.

రాజ్యసభ ఎన్నికలను వాయిదా వేయడాన్ని చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కూడ నిర్వహించాలని భావిస్తోందన్నారు. ఈ సమావేశాలపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

కరోనా వైరస్ వచ్చి ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే రాజకీయాలు చేయడం సరైంది కాదన్నారు. ఈ సమయంలో రాజకీయాలు  చేయడం తమ అభిమతం కాదని ఆయన స్పష్టం చేశారు.

ఏపీ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా విమర్శలు చేస్తోందన్నారు. తాను కూడ విమర్శలు చేసేవాడిని.. కానీ ఇది విమర్శలు చేసేందుకు సమయం కాదన్నారు. అందుకే ప్రభుత్వం విమర్శలు చేసినా కూడ తాను ఎలాంటి విమర్శలు చేయలేదని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రజల కోసం రాజకీయాలు చేయాలి. వ్యక్తిగతం కోసం, స్వార్థం కోసం రాజకీయాలు చేయడం సరికాదన్నారు.