అమరావతి: కరోనా పాజిటివ్ లక్షణాలు పెరిగి పోవడంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్టుగా మంగళవారంనాడు ప్రకటించింది.

ఏపీ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఏపీలో కరోనా పాజిటివ్ లక్షణాల కేసుల సంఖ్య ఏడుకు చేరింది. దీంతో టెన్త్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 23వ తేదీ నుండి జరగాల్సిన పదోతరగతి పరీక్షలను  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  వాయిదా వేసిన విషయం తెలిసిందే.

ఈ నెల 31వ తేదీ నుండి ఏపీ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. ఏప్రిల్ 17వ తేదీ వరకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ ను ఇదివరకే ప్రకటించారు.

రెండు వారాల పాటు పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్టుగా ఏపీ సర్కార్ తేల్చి చెప్పింది. ఈ నెల 31వ తేదీ తర్వాత సమీక్ష నిర్వహించి పరీక్షల నిర్వహణపై ప్రకటన చేయనున్నట్టు ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.ఇప్పటికే ఏపీ రాష్ట్రంలో విద్యా సంస్థలను మూసివేసింది. 

రెండోసారి పదో తరగతి పరీక్షలు వాయిదా

ఈ నెల 23వ తేదీ నుండి పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని తొలుత ప్రభుత్వం ప్రకటించింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను పురస్కరించుకొని తొలుత పదోతరగతి పరీక్షలను వాయిదా వేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా ఈ నెల 23వ తేదీ నుండి ఈ నెల 31వ తేదీకి పదోతరగతి పరీక్షల షెడ్యూల్ ను మార్చారు. అయితే కరోనా కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు కూడ వాయిదా వేసింది ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం.

మరోవైపు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టెన్త్ పరీక్షలను వాయిదా వేయాలని మంగళవారం నాడు విద్యాశాఖ నిర్ణయం తీసుకొంది. సీఎం జగన్ తో సమావేశం తర్వాత ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సురేష్ ఈ మేరకు ఓ ప్రకటన చేశారు.