తాము అధికారంలో ఉన్నప్పుడు రైతులకు పూర్తి భరోసా కల్పించామని... కానీ ఈ నూతన ప్రభుత్వ హయాంలో రైతుల్లో ఆ ధైర్యం కనపడటం లేదని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. గురువారం తమ పార్టీ వ్యూహ కమిటీ తో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం రైతుల్లో భవిష్యత్తుపై ఆవేదన పెరిగి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసా రైతుల్లో కల్పించాలని సూచించారు.

విద్యుత్ ఛార్జీలు పెంచమని తాము అధికారంలో ఉన్నప్పుడు చెప్పామని.. అందుకే సౌర, పవన విద్యుదుత్పత్తి పెంచామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. టీడీపీ ముందుచూపు వల్లే ఇప్పుడు యూనిట్ ధర రూ.2.40కు లభిస్తోందన్నారు. పీపీఏలపై సమీక్ష పేరుతో కంపెనీలను బెదిరిస్తున్నారని.. అది మంచి పద్ధతి కాదన్నారు.

పీపీఏలన్నీ పారదర్శకమని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని గుర్తు చేశారు. సాక్షాత్తు కేంద్రమంత్రి, ఇందన కార్యదర్శి లేఖలే అందుకు రుజువని చంద్రబాబు చెప్పారు. ఫిచ్ రేటింగ్స్ సంస్థతల హెచ్చరికలు పట్టించుకోరన్నారు. పాలకుల మూర్ఖత్వం ప్రజలకు శాపంగా మారకూడదన్నారు.

తన కంపెనీలు మాత్రం యూనిట్ రూ.5కు అమ్ముకోవాలని... మిగిలిన కంపెనీలు నాశనం కావాలని సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో అధికారులపై, కంపెనీలపై క్రిమినల్ కేసులు పెట్టాలని అంటున్నారని.. కర్ణాటకలో జగన్ కి చెందిన కంపెనీ రూ.5ను కొన్న అధికారులపై కూడా క్రిమినల్ కేసులు పెట్టాలా అని ప్రశ్నించారు.