ఆంధ్ర ప్రదేశ్ లో 2024 కంటే ముందుగానే ఎన్నికలు జరిగినా జరగొచ్చు... కాబట్టి ఎప్పుడు ఎన్నికలు జరిగినా సిద్దంగా వుండాలని టిడిపి చీఫ్ చంద్రబాబు పార్టీ లీడర్లు, క్యాడర్ కు సూచించారు.
అమరావతి: ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ ముందస్తు ఎన్నికలు జరుగుతాయంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా సిద్దంగా వుండాలని స్వయంగా దేశ హోంమంత్రి అమిత్ షా ఇటీవల చేసిన వ్యాఖ్యలు, తాజాగా 2024కు ముందుగానే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలతో ముందస్తు ప్రచారం మరింత జోరందుకుంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా టిడిపి లీడర్లు, క్యాడర్ సిద్దంగా వుండాలని చంద్రబాబు సూచించడం ఏపీలో ముందుస్తు ఖాయమేనని అర్థమవుతోంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జిల్లాల పర్యటన, వైసిపి ప్రజాప్రతినిధులు గడపగడపకు మన ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో భాగంగా ప్రజల్లోకి వెళుతున్నారు. ఈ క్రమంలో టిడిపి కూడా బాదుడే బాదుడు పేరిట నిత్యావసరాలు, ప్రభుత్వ పన్నుల పెంపుపై నిరసనలు చేపడుతూ ప్రజల్లోకి వెళుతోంది. ఈ రెండు కార్యక్రమాల ద్వారా ప్రజల మద్దతు ఎవరికి వుందో స్పష్టంగా తెలిసిపోతోందని చంద్రబాబు అన్నారు. కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రజలకు టిడిపి ఇప్పుడు ఒక హోప్ గా కనిపిస్తోందని... కాబట్టే ప్రజల్లోకి వెళ్లిన టిడిపికి స్వాగతాలు...గడపగడపలో వైసిపి నేతలకు నిలదీతలు అందుకు నిదర్శనమన్నారు.
టిడిపి చేపట్టిన బాదుడే బాదుడు నిరసనలు, పార్టీ మెంబర్ షిప్, ఓటర్ వెరిఫికేషన్, మహానాడు నిర్వహణపై చంద్రబాబు గ్రామ, మండల స్థాయి నేతలతో ఇవాళ (మంగళవారం) మాట్లాడారు. పార్టీ గ్రామ, మండల కమిటీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి బాదుడే బాదుడు, మెంబర్ షిప్, ఓటర్ వెరిఫికేషన్, మహానాడుపై సమీక్ష చేపట్టారు.
ఈ సదర్భంగా వైసిపి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో ప్రజలు తీవ్ర కష్టాల పాలయ్యారని చంద్రబాబు నాయుడు అన్నారు. పాలనా వైఫల్యాలు, ప్రభుత్వ నిర్ణయాలతో రాష్ట్ర ప్రజలు కష్టాలపాలవుతున్నారని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేసారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా గ్రామ స్థాయి వరకు ఎక్కడా నిర్లక్ష్యం చెయ్యకుండా ఇంటింటికీ వెళ్లాలని నేతలకు సూచించారు.
ఇప్పటికే టిడిపి శ్రేణులు, నేతలు గ్రామాల్లో ఇళ్ల కు వెళుతుంటే...ప్రజలు ఎదురొచ్చి తమ కష్టాలు చెప్పుకుంటున్నారని అన్నారు. ఇదే సందర్భంలో వైసిపి నేతలు గడప గడపకు కార్యక్రమంలో ప్రజల వద్దకు వెళుతుంటే సమస్యలపై గట్టిగా నిలదీస్తున్నారని గుర్తుచేశారు. ప్రజల్లో ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకతకు ఇది ప్రత్యక్ష ఉదాహరణ అని చంద్రబాబు అన్నారు. ప్రజల భవిష్యత్ కు టీడీపీ భరోసాగా కనిపిస్తుందని చంద్రబాబు అన్నారు.
తన జిల్లాల పర్యటనకు వస్తున్న స్పందనను కూడా నేతలతో చంద్రబాబు పంచుకున్నారు. నాయకులు అనే వారు నిత్యం ప్రజలకు దగ్గరగా ఉండాలని సూచించారు. జగన్ ప్రభుత్వ పై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని... అన్ని వర్గాలలో, అన్ని ప్రాంతాలలో అది స్పష్టంగా కనిపిస్తుందన్నారు. .టిడిపికి ఇదొక మంచి చిహ్నం అని చంద్రబాబు అన్నారు. అప్పుడూ ఇప్పుడని కాదు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్దంగా వుండాలని చంద్రబాబు సూచించారు.
ఇటీవల ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తే గత కొంతకాలంగా జరుగుతున్న ముందస్తు ప్రచారం నిజమేనని అనిపిస్తుంది. సజ్జల మీడియాతో మాట్లాడుతూ ఏడాది, రెండేళ్లలో ఎన్నికలకు వెళ్లబోతున్నామని చెప్పారు. తమ ప్రభుత్వ పనితీరు ప్రజల్లోకి బాగా వెళ్లిందని, జగన్ అమలు చేసిన పథకాలు విజయవంతం అయ్యాయని అన్నారు. మాములుగా అయితే ఏపీలో మరో రెండేళ్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే సజ్జల మాత్రం ఏడాది, రెండేళ్లలో అని చెప్పడం ద్వారా వైసీపీ క్యాడర్‌లోని ముందస్తు సంకేతాలు పంపారనే టాక్ వినిపిస్తోంది.
