తిరుపతి: నా సభపైనే రాళ్లు వేస్తారా... మందుపాతరలకే భయపడలేదు, గులకరాళ్లకు భయపడతానా అని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు చెప్పారు. చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో టీడీపీ కార్యాలయంలో  ఉగాది వేడుకల్లో చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 

రాష్ట్ర సమస్యలపై పోరాటం చేసి ప్రజలను కాపాడే బాధ్యత టీడీపీపై ఉందన్నారు. తిరుపతిలో శాంతిభద్రతలకు ఆటంకం ఏర్పడితే తిరుమలపై ప్రభావం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.రెండేళ్లలో రాష్ట్రాభివృద్దికి ఏమీ చేయలేని వైసీపీ తమ సభపై రాళ్లతో దాడులు చేయిస్తోందని ఆయన ఆరోపించారు.కొత్త ఏడాదిలో సమస్యలకు భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఈ ఏడాది టీడీపీకి ఎంతో అనుకూలంగా ఉండబోతోందన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. 

సోమవారం నాడు రాత్రి తిరుపతి పట్టణంలో చంద్రబాబునాయుడు రోడ్ షో నిర్వహిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్తతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ దాడిని నిరసిస్తూ బాబు కొద్దిసేపు రోడ్డుపైనే బైఠాయించి నిరసనకు దిగారు.