ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై(YS Jagan)  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) విరుచుకుపడ్డారు. సీఎం జగన్.. లేని సమస్యను సృష్టించి సినీ హీరోలను ఘోరంగా అవమానించారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై(YS Jagan) తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) విరుచుకుపడ్డారు. సీఎం జగన్.. లేని సమస్యను సృష్టించి సినీ హీరోలను ఘోరంగా అవమానించారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. స్వశక్తితో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు జగన్‌ని ప్రాధేయపడాలా అని ప్రశ్నించారు. ప్రపంచ స్థాయికి ఎదిగిన సినీ పరిశ్రమను జగన్‌ కించపరిచారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై వైసీపీ యుద్దం ఎక్కడని ప్రశ్నించారు. యుద్దం చేయకుండా పలాయనవాదమెందుకు వైఎస్ జగన్‌ను చంద్రబాబు ప్రశ్నించారు. 

ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎంపీల రాజీనామాలపై చేసిన గతంలో చేసిన సవాళ్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. వాటిపై జగన్‌.. ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సోమవారం టీడీపీ కార్యాలయంలో పార్టీ వ్యుహకమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. కేంద్ర హోంశాఖ అజెండాలో ప్రత్యేకహోదా అంశం తమ ఘనతగా చెప్పుకున్న వైసీపీ నేతలు.. ఇప్పుడు టీడీపీపై ఎందుకు బురద జల్లుతున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. 

ఏపీ ఆదాయం తగ్గలేదని.. అయినప్పటికీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని విమర్శించారు. ఈశాన్య రాష్ట్రాల కంటే ఏపీ ఆర్థికంగా దిగజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు బడులను దూరం చేయడమే నాడు నేడు పథకమా? అని ప్రశ్నించారు. కరెంట్ సరఫరా లేదు కానీ.. అధిక బిల్లులు మాత్రం వస్తున్నాయని, మోటర్లకు మీటర్ల బిగింపును ప్రభుత్వం నిలిపివేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

కొద్ది రోజుల క్రితం కూడా సినీ ప్రముఖులు, జగన్ భేటీపై చంద్రబాబు స్పందించారు. సినిమా వాళ్ల పొట్ట మీద కొట్టి భయపెట్టారని ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు. ఫిల్మ్ ఇండస్ట్రీపై కక్షతో (tollywood) వ్యవహరించారని ఆయన ఆరోపించారు. నిన్న జరిగింది చూస్తే ఇలా కూడా చేయొచ్చా అనిపించిందన్నారు చంద్రబాబు . తాను 40 ఏళ్ల క్రితం సినిమాటోగ్రఫీ మంత్రిగా చేశానని, ఆ తర్వాత 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశానని తెలిపారు. చిత్ర పరిశ్రమలో సమస్యను సృష్టించి.. దానిని పరిష్కరిస్తామనే నెపంతో ఆడుకున్నారని చంద్రబాబు మండిపడ్డారు. సినీ పరిశ్రమకు చెందినవాళ్లు వాళ్ల పని వాళ్లు చేసుకుంటారని.. అందులోనూ వేలు పెట్టారంటూ జగన్‌పై విమర్శలు చేశారు. సీఎంగా ఇన్నాళ్లు పనిచేశానని.. కానీ ఇవేవి తనకు తెలియదని, ఇప్పుడే నేర్చుకుంటున్నానని బాబు సెటైర్లు వేశారు.