Asianet News TeluguAsianet News Telugu

16న మోడీతో చంద్రబాబు ముఖాముఖి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 16వ తేదీన ఒకే వేదిక మీదికి రానున్నారు.

Chandrababu may meet PM on June 16

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 16వ తేదీన ఒకే వేదిక మీదికి రానున్నారు. నీతి ఆయోగ్ సాధారణ మండలి సమావేశం అందుకు వేదిక అవుతోంది. ఎన్డీఎలో తెలుగుదేశం పార్టీ కొనసాగుతున్న సమయంలో కూడా చాలా కాలం మోడీ చంద్రబాబుకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదు.

ఎన్డీఎతో తెలుగుదేశం పార్టీ తెగదెంపులు చేసుకున్న తర్వాత మోడీతో కలిసి చంద్రబాబు ఓ సమావేశంలో పాల్గొనడం ఇదే తొలిసారి కాబోతోంది. ఈ నెల 16వ తేదీ నీతి ఆయోగ్ సమావేశంలో తాను అడగాల్సినవన్నీ చంద్రబాబు మోడీని అడిగే అవకాశం ఉందని అంటున్నారు.
 
నీతి ఆయోగ్ సాధారణ మండలిలో దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు. ప్రధాని ఆధ్వర్యంలో జరిగే ఈ భేటీలో చంద్రబాబు పాల్గొనే అవకాశం ఉంది. కేంద్ర-రాష్ట్రాల మధ్య పన్నుల ఆదాయం పంపిణీ, రాష్ట్రాలకు గ్రాంట్ల విషయంలో నీతి ఆయోగ్‌కు కేంద్రం ఇచ్చిన టెర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌(టీవోఆర్‌)పై పలు రాష్ట్రాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. 

ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ, కేరళ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, కర్ణాటక, పాండిచ్చేరి తదితర రాష్ట్రాలుకేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి. నీతి ఆయోగ్‌ చేయాల్సిన పనిని కేంద్రం చేయడం ఏమిటని కేరళలో జరిగిన కొన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం మండిపడింది. 

ఆ ఆర్థికమంత్రుల రెండో సమావేశం అమరావతిలో నిర్వహించారు. తమ గొంతు గట్టిగా వినిపించడానికి ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా నీతిఆయోగ్‌ సమావేశంలో పాల్గొంటారని భావిస్తున్నారు. 

నిధుల పంపిణీకి 1971 జనాభా లెక్కలను కాకుండా 2011 లెక్కలను పరిగణలోకి తీసుకోవాలని కేంద్రం చెప్పడం జనాభా నియంత్రణ కోసం కృషిచేసిన దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలిగిస్తుందని అంటున్నారు. ఈ విషయంపై దక్షిణాది రాష్ట్రాలు ప్రశ్నించే అవకాశం ఉంది.
 
కాగా, 16వ తేదీన రంజాన్‌ పర్వదినం. ఆ రోజు సమావేశం పెట్టడమేమిటని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంపై నిరసన వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్‌ సమావేశాన్ని 17వ తేదీకి గానీ, మరో తేదీకి గానీ వాయిదా వేయాలని  కోరుతున్నట్లు తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios