కోవిడ్‌పై రాజకీయాలు చేయడం చంద్రబాబు, లోకేష్, పవన్ లకే చెల్లింది: వెల్లంపల్లి
ప్రజలు కరోనాతో ఇబ్బంది పడుతుంటే అరెస్టయిన అచ్చెన్నాయుడిని పరామర్శించడం తప్ప చంద్రబాబు, లోకేష్, టిడిపి నేతలు ప్రజల్లో ఏ ఒక్కరికైనా భరోసా ఇచ్చారా? అని మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ప్రశ్నించారు.
విజయవాడ: ప్రజలు కరోనాతో ఇబ్బంది పడుతుంటే అరెస్టయిన అచ్చెన్నాయుడిని పరామర్శించడం తప్ప చంద్రబాబు, లోకేష్, టిడిపి నేతలు ప్రజల్లో ఏ ఒక్కరికైనా భరోసా ఇచ్చారా? అని మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ప్రశ్నించారు. కృష్ణా జిల్లా కలెక్టరు క్యాంపు కార్యాలయంలో బుధవారం కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై అధికారులతో మంత్రి వెలంపల్లి సమీక్షా సమావేశం నిర్వహించారు.
అనంతరం తూర్పు నియోజకవర్గం ఇన్‌చార్జ్ దేవినేని అవినాష్, కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, సిపి బత్తిన శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ లతో కలిసి మంత్రి వెలంపల్లి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలెవ్వరూ భయపడాల్సిన పని లేదని ధైర్యం చెప్పారు. కరోనా రోగులకు ప్రభుత్వ పరంగా అన్ని వైద్య సేవలందిస్తున్నామని అన్నారు.
రాష్ట్రంలో కరోనా పరీక్షలు నిర్వహించే స్థానంలో కృష్ణాజిల్లా నెంబర్ వన్ లో ఉందన్నారు. ఇంతవరకు 2,08,000 పరీక్షలు నిర్వహించగా వాటిలో 6 వేల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయన్నారు. కరోనా పరీక్షలు నిర్వహించడంలో జిల్లా ప్రధమస్థానంలో ఉందన్నారు. నమోదైన పాజిటివ్ కేసుల్లో 4290 (71.5 శాతం) ఆరోగ్యంతో డిశ్చార్జి కాగా, 1557 కేసులు వైద్యం పొందుతున్నారన్నారు.
read more జూమ్ యాపుల్లో, టీవీల్లో మాట్లాడం తప్ప చంద్రబాబు ఏం చేశాడు.. వెల్లంపల్లి
ఇక విజయవాడ నగర పరిధిలో 3 వేల కేసులు నమోదు అయ్యాయన్నారు. స్టేట్ కోవిడ్ ఆసుపత్రి జిజిహెచ్ లో 790 పడకలు ఉండగా 400 మంది వైద్యం పొందుతున్నారని, పిన్నమనేని సిద్ధార్ధలో 625 పడకలకుగాను 370 మంది, నిమ్రాలో 650 పడకలకు గాను 300 మంది వైద్య సేవలు పొందుతున్నారన్నారు. కరోనా పాజిటివ్ వ్యక్తులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు పౌష్టికాహారం అందించడంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి వైయస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశించడం జరిగిందని... డబ్బుకు వెనుకాడకుండా వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు.
ఆసుపత్రుల్లో బెడ్ల సామర్ధ్యాన్ని పెంచడంతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనాకు ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందిస్తున్నామన్నారు. జిల్లాలో ముందస్తుగా తీసుకున్న చర్యల మూలంగా కేసుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టిందన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను జిల్లా యంత్రాంగం పాటిస్తూ కరోనా నియంత్రణకు పటిష్టమైన చర్యలు అమలుచేస్తోందన్నారు.
హోమ్ క్వారం టైన్ కు ప్రాధాన్యతను ఇస్తున్నామని, హోమ్ క్వారంటైన్ లో ఉన్నవారికి వైద్య సిబ్బంది సేవలు, మందులతో కూడిన కిట్లను అందించడం జరుగుతున్నదన్నారు. కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని ఎవరు భయపడవలసిన పనిలేదని... ప్రభుత్వపరంగా అన్ని వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. కోవిడ్ ను కూడా కొంతమంది రాజకీయం చేయడం బాధాకరమన్నారు.
అనంతరం జిల్లా కలెక్టరు ఏయండి. ఇంతియాజ్ మాట్లాడారు. సమావేశంలో తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్ దేవినేని అవినాష్, నగరపాలక సంస్థ కమిషనరు వి.ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టరు (అభివృద్ధి ) యల్. శివశంకర్, , తదితరులు పాల్గొన్నారు.